పుట:TellakagitaM.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాటొకటి చెప్పిపోనీ

గాయాలు నాకు గేయాలై వినిపిస్తున్నప్పుడు
గేయాలు గాయాలై సలిపేస్తున్నప్పుడు
నా సాహిత్యాన్ని ఆస్వాదించనంటావా!
విషాద సంగీతంలా నిన్ను ఆలకించమంటావా!!

గాయం నేనైనప్పుడు ఎవరు గాయపడ్డట్టూ!!
కోల్పోయేది స్నేహ సౌహార్దమో కుటుంబ క్షేమమో

నా ముగింపు ప్రజావినోదమో స్వీయ విషాదమో
నాకళ్ళకు నీ కలల భయమెందుకో

ఎందుకిలా నమ్మకాల తరాజు
చీకటితో పాటు మొగ్గుతుంది!
ఎందుకో గడిచిన రోజుల జీవితం
ఒంటరి అలోచనలను కుదుపుతుంది

వాలిన పొద్దు మరునాటికి వెన్ను పొడుస్తుంది
ఏ విషాదాలు మెదులుతున్నాయి తలపుల్లో
నాకెందుకు నేనంటే భయం?
పలుకని నిజాలు నను బేరీజు వేస్తున్నాయా!
నేనుండని రేపటి వెలుగుల గుట్టు ఈరోజే విప్పి పోనీ

అలకల రాణీ!
నువ్వొప్పుకున్న నెప్పేగా మన అనుబంధం
ఏళ్ళు గడచినా మళ్ళీ నీతో మనసువిప్పి చెప్పుకోనీ
నిను ఎప్పటికీ ప్రేమించిన మాటొకటి ఈరోజు ఇప్పుడే చెప్పిపోనీ.