పుట:TellakagitaM.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహత్తర జీవిత కాంక్ష

పుస్తకాలు మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి. భావాల ఉద్రేకాల, సంఘటనల, భయంకర గందరగోళంలో నుంచి బయటపడేందుకు అవి మీకు స్నేహపూరితమైన ఆలంబన ఇస్తాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, పరులను గౌరవించడం నేర్పుతాయి. హృదయాన్ని, మేధను; మనిషిపట్ల, ప్రపంచం పట్ల ప్రేమతో నింపివేస్తాయి. మనుషుల్లో మీరు చూడని దాన్ని, ఎదుటివాడు చెప్పడానికి ఇష్టపడనిదాన్ని పుస్తకాలు మీకు చెబుతాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, స్వాభావిక, ప్రాకృతిక తదితర కారణాల చేత మనిషి సతతం నిక్షిప్తం చేసుకున్న వైరుధ్యాలను బహిర్గతం చేస్తాయి. ఎందుచేతనైనా గానీ, వారు పోషించే అల్పత్వాలను పరిహసిస్తాయి. అలాగే సర్వశ్రేష్ఠతనూ ప్రస్తుతిస్తాయి.

మానవుడి సర్వకాల సర్వావస్థలనూ చిత్రణ చేసినవి పుస్తకాలే. సారంలో ప్రపంచ మానవులందరి బాధలూ ఒక్కటే. మనిషిపై ఆధిపత్య శక్తులు చేసే దోపిడీని, చూపే వివక్షనూ మానవ ప్రేమికులు అన్నికాలాల్లోనూ అడ్డుకుంటూనే ఉన్నారు. వారి గురించి తెలుసుకోవడమంటే మానవుడి శ్రేష్ఠమైన గౌరవం గురించి తెలుసుకోవడమే. ఒక మనిషితో ఏళ్ల తరబడి సాహచర్యం చేసినా అతడి లేదా ఆమె గురించి పాక్షికంగా మాత్రమే తెలుసుకోగలరు. అదే సమగ్రంగా చిత్రించిన ఒక మంచిపుస్తకం ... మనిషి జీవితాన్ని అన్ని కోణాల్లో మీకు చెబుతుంది. పుస్తకాలను చదవడమంటే జీవితాన్ని చదవడమే. చరిత్రను చదవడం, సంస్కృతిని అర్థంచేసుకోవడమే. మహాభారత, రామాయణ గ్రంథాలు, గాథలు భారత సంస్కృతి పై చూపుతున్న ప్రభావం విస్మరించరానిది. వేల ఏళ్లుగా గడచి వస్తున్న చరిత్రనూ, సంస్కృతిని మీరు అర్థం చేసుకోవాలంటే పుస్తకాలకు మించిన సాధనాలు లేవు. మరో మాట.. వాస్తవ జీవితాన్ని మాత్రమే తెలియజేసి అంతటితో తనపని అయిపోయిందని ఊరుకోదు సాహిత్యం. జీవితం ఇప్పుడున్న స్థితికంటే ఒక డుగు ముందుకెయ్యాలంటే ఏం చెయ్యాలో కూడా సూచిస్తుంది. కనీసం ఆరకమైన ఆలోచననైనా మీలో రేకెత్తిస్తుంది. అడుగడుగునా జీవితం పై విరక్తి పుట్టడానికి గల కారణాలను విశ్లేషిస్తూనే.. వైరాగ్యాన్ని పోగొట్టి జీవితాన్ని సుఖమయం చేసుకోగలమన్న ఆశను, తపనను కలిగిస్తుంది. మహత్తర జీవిత కాంక్షను కలిగించేది సాహిత్యం ఒక్కటే.. "ది ఫౌండేషన్ ఆఫ్ తెలుగు లిటరేచర్"