పుట:Tatwamula vivaramu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని దాని అర్థము ఏమాత్రము తెలియదు. నేటికి కాలజ్ఞాన తత్త్వములను పుస్తకములు ఎక్కడైన కనిపించినప్పటికి అందులో తత్త్వాలు గలవుగాని వాటికి అర్థమును ఎవరు వ్రాయలేదు. బాగ అర్థమయ్యే పుస్తకాలను కూడ చదివే ఓపికలేదను మనుషులు అర్థముకాని అర్థములేని వాటిని చదవరు. కొందరు సంస్కృతమును నేర్చిన స్వావిూజీలు ఏ పాండిత్యములేని తత్త్వములను చూచి వాటిని మతి స్థిమితములేనివారు వ్రాసిన తిక్క వ్రాతలు అంటున్నారు. ఇట్లు ఎన్నో విధముల ఆధ్యాత్మిక విద్యలో ఆణిముత్యములైన తత్త్వములకు ఏమాత్రము గుర్తింపు లేకుండపోయినది. కొన ఊపిరితో మరణశయ్యవిూదున్న వానిలాగ తత్త్వములు అంత్యదశకు చేరుకొనుట మాకు కొంత భాద అనిపించింది. అవి తిక్క వ్రాతలుకాదు, మన పెద్దలు సంపాదించి ముడివేసిన పెట్టిన జ్ఞానధనము యొక్క మూటలని చెప్పదలచుకొన్నాము. అవి జ్ఞానధన నిలయములని అందరు గుర్తించలాంటే ఆ మూటలలో ఏముందో విప్పిచూపితేకాని అర్థముకాదనుకొన్నాము. అందువలన అందరికి వాటిలోని అర్థమును వివరించాలనుకొని ఆ కార్యమును గ్రంథరూపము లోనికి తెచ్చాము ఆ చిన్న గ్రంథమే ఈ "తత్త్వముల వివరము"


తత్త్వములన్నిటిని వ్రాయాలంటె చాలా కష్టమైన పని కావున వివిధ రూపాలలో పద్దతులలోనున్న వాటిని ఏరుకొని వివరించి విూ ముందుంచు తున్నాము. వీటిలో సులభమైనవి కష్టమైనవి రెండు రకముల తత్త్వములు గలవు. అంతేగాక వీటిని ఎవరైన అర్థము చెప్పగలరా అని సవాలు చేసినవి, చెప్పగలనంటే సంవత్సరమైన గడువిస్తామని సవాలు విసిరిన వాటిని ఏరుకొని వ్రాశాము. వారి సవాల్లు మాకు పౌరుషమును పోసి వ్రాయించినవి. తత్త్వములన్ని శరీరములోపలి జ్ఞానమును సూచించునవి