పుట:Tatwamula vivaramu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనులన్నియు నిలిచిపోయివుండును. జీర్ణాశయము పనులుగాని, ఊపిరి తిత్తుల కార్యముగాని, గుండెయొక్క కదలికగాని, రక్తప్రసరణగాని ఏమి లేకుండ స్థంభించి పోయివుండును. అపుడు యోగి శరీరములో నిద్రలో కదలనట్లుండును. ఊపిరి కూడ లేదు కావున ఒక విధముగ మృతదేహము వలె కనిపించును. కాని లోపల ఆత్మ జీవాత్మ రెండు ఉన్నాయి కనుక ఆ స్థితిని యోగనిద్ర అని కూడ అనుచున్నాము. ఈ యోగవిషయమును ఈ తత్త్వములో ప్రస్తావిస్తు గొప్ప కొండలేడు మ్రింగి గురుకపెట్టెర అన్నారు. దీనిని వివరించుకొంటే యోగమును కొడుకనుకొన్నాము కదా! యోగము క్రిందినుండి ఆరు కేంద్రములనెక్కి ఏడవకేంద్రము చేరుచున్నది. కావున ఏడు నాడీకేంద్రములను గొప్ప కొండలుగ పోల్చి చెప్పి గొప్ప కొండలేడు మ్రింగెర అన్నారు. అక్కడ చేరిన యోగము ఆత్మయందు చేరి నిలిచిపోవుచున్నది. శరీర ధ్యాస మరియు పనులు అన్ని నిలిచి నిద్ర పొందిన వానిలాగ కనిపిస్తున్నాడు, కావున అది యోగనిద్రగ లెక్కించి కొండలేడుమ్రింగి గురక పెట్టెర అన్నారు. విూకు బాగ అర్థమగుటకు మరొక మారు ఈ చరణములోని పదముల పోలికను గురించి చెప్పుచున్నాము. గొడ్రాలు మహిళ అనగ అజ్ఞాన మానవుడు అని అర్థము. ముట్టు తప్పడము అనగ జ్ఞానము మీద ఆసక్తికల్గి తన తలలో జ్ఞానమును వేసుకోవడము అని అర్థము. కొడుకు పుట్టడమంటే జ్ఞానము పొందినవాడు కొంత కాలమునకు యోగి అగును అని అర్థము. గొప్ప కొండలేడు మ్రింగి అనగా శరీరములోని ఏడు నాడీకేంద్రములనెక్కి ఏడవ దానిలోని ఆత్మయందు చేరడమని అర్థము. గురక పెట్టెర అనగ ఆత్మయందు చేరిన జీవాత్మ యోగము అను స్థితిలో ఉన్నాడు. కనుక అది కదలని మెదలని స్థితి కావున దానిని యోగనిద్ర అని గాఢనిద్రలో గురక వచ్చినట్లు గాఢమైన యోగములో జీవాత్మ లగ్నమైవున్నాడని అర్థము.