పుట:Tatwamula vivaramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నారు. ఇపుడు ఈ తత్త్వ వివరమును తెలిసి మేము వ్రాయాలంటే యాగంటి గురుడుగ మారి పోక తప్పదు. అలా మారి ఆయనకు ఏ వివరము తెలిసిందో మనము తెలుసుకొందాము.


 1) గండుపిల్లి లోకమెల్ల పారజూచి ఏలగాను,
కొండ ఎలుక లొక్క రెండు కొలువు జేసేరా || గుట్టు||

మన శరీరములో కదలికశక్తి ఉన్నది. ఆ శక్తిని చైతన్యశక్తి అంటున్నాము. ఆ శక్తి శరీరములో ఎక్కడున్నదో ఎట్లున్నదో ఎవరికి తెలియదు. దానిని ఎవరు చూడలేదు. మనిషి శరీర బరువుకంటె ఎక్కువున్న బరువును కూడ శరీరములోని శక్తి కదలించుచున్నది. బయటి వస్తువులను కదలించు శక్తి మన శరీరములోని శ్వాసను కూడ ఆడించుచున్నది. చైతన్యమును నమ్మలేనివారు కూడ శ్వాస కదలిక చూచి నమ్మవలసి వస్తున్నది. కనిపించని చైతన్యమును ఒక పేరు పెట్టి పిలువడము జరిగినది. ఆ పేరే "ఆత్మ". ఆత్మ ఒక్క చోట కేంద్రముగ ఉండి శరీరమునంతటిని తన చైతన్యము చేత నడుపుచున్నది. కనిపించని ఆత్మ శరీరములో ఉందా లేదా అని చూచుటకు శ్వాసను బట్టి చూడవలసిందే. శ్వాస ముక్కు రంద్రములలో ఆడుచువుంటే లోపల ఆత్మ ఉందని, శ్వాస ఆడకపోతే లోపల ఆత్మలేదని తెలియగలుగుచున్నాము. ఆకాశములోని సూర్యుడు తన కిరణముల చేత లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు శరీరములోని బ్రహ్మనాడి ఏడవ కేంద్రములోవున్న ఆత్మ తన చైతన్యము చేత శరీరమునంతటిని ప్రకాశింపజేయుచున్నది. శరీరములో ఆత్మ ప్రకాశమున్నదా లేదా అనుటకు బయటకు కనిపించు శ్వాసే ఆధారము. దీనిని బట్టి రాజువలె ఆత్మ శరీర సామ్రాజ్యమును ఏలుచున్నప్పటికి ఆత్మ అనెడి రాజు కనిపించలేదు. కాని ఆత్మకు ఎన్నో