పుట:Tatwamula vivaramu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్ని స్థలములలోను ఎల్లవేళల అంతట వ్యాపించివున్న పరమాత్మ జ్ఞానము తెలియక మిగత చిల్లర దేవుల్లను గొప్పగ పెట్టుకొన్నారు. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నియమము ప్రకారము పూజలు చేయుచున్నారు. తనలోనే ఉన్న పరమాత్మను గుర్తించలేక కొందరు తీర్థయాత్రలు, కొందరు వ్రతక్రతువులు, కొందరు యజ్ఞయాగాదులను చేయుచున్నారు. చివరకు ఇవన్ని వృథాప్రయాసలని తెలుసుకొన్నవారు దేవుని జ్ఞానమును పొందు చున్నారు. ఈ విధముగ అసలైన దేవుని జ్ఞానము తెలిసిన పెద్దలు జ్ఞానము తెలియనివారిని గూర్చి తత్త్వరూపములో చెప్పిన దానిని క్రింద వివరించుకొందాము.


చిల్లర రాళ్ళకు మ్రొక్కుచువుంటే చిత్తము చెడునుర ఒరేయొరే
చిత్తమునందు చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే ||చి||

సర్వ సృష్ఠికి మూలకర్త అయిన పరమాత్మ విశ్వమంత వ్యాపించి అణువణువున నిండియున్నాడు. మానవజన్మ యొక్క అంతరార్థము పరమాత్మను తెలుసుకోవడమే, అయినప్పటికి ఆ దేవున్ని తెలుసుకొను జ్ఞానము తెలియకుండపోయినది. జ్ఞానము తెలియక మాయలో మునిగియున్న మానవులు తమలోని భక్తిని దేవుడైన పరమాత్మ మీద కాక మాయయైన చిల్లర దేవుల్ల మీద చూపుచున్నారు. దేవుడు కానటువంటి మాయయైన చిల్లర దేవుల్లను మ్రొక్కడము వలన మనిషిలోని చిత్తము అనేక భ్రమలలో మునిగిపోవుచున్నది. అనేక దేవుల్లలో ఏ ఒక్క దేవుని మీదను కాక అనేక దేవుల్లను పండుగలను బట్టి, కోర్కెలను బట్టి పూజించుట వలన చిత్తములో ఏమాత్రము శాంతి ఏర్పడక మనిషి అశాంతితో మునిగిపోవుచున్నాడు. కావున జ్ఞానము తెలిసిన పెద్దలు పై తత్త్వములో చిల్లర రాల్లకు మ్రొక్కుచుయుంటే చిత్తము చెడునుర అన్నారు.