పుట:Tatwamula vivaramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివరము :- ఈ తత్త్వము నేటికిని అక్కడక్కడ పల్లెజనము పాడుచునే ఉన్నారు. దీనిని వారందరికి అర్థమగులాగున వివరించుకొందాము. ఈ తత్త్వములో మొదటి వాక్యములోనే సంధి తెలిపే జ్ఞానులెవరే అని వ్రాయబడి ఉన్నది. ఇద్దరి మద్యన ఉండుదానిని సంధి అంటాము. ఉదాహరణకు పగలు రాత్రికి మద్యలో ప్రొద్దుక్రుంకు వేళను సంధికాలము అంటున్నారు దానినే సంధ్యవేళ అంటున్నాము. రాత్రి పగలును కలుపు కాలమును సంధికాలము అన్నట్లు ఇద్దరు మనుషులను కలుపు వ్యవహారమును సంధి చేయడము అని కూడ అనుచున్నాము. అలాగే జీవున్ని దేవున్ని కలుపుటకు మద్యలోనున్న జ్ఞానమును సంధి అని అనుచున్నాము. జీవుడు దేవునితో కలుసుటకు ముందు సంధి చేయవలసి ఉన్నది. ఆ సంధియను జ్ఞానమును తెలిపేవారు పూర్తి జ్ఞానపరులై ఉండవలెను. తనకు తెలియని జ్ఞానమును వాక్యము రూపముతో చెప్పుచు ఈ జ్ఞాన వివరము తెలిపే వారెవరు అని అడిగినట్లు ఈ తత్త్వములో గలదు. పూర్వము ఒక వ్యక్తి పున్నమిరోజున ఆరుబయట పడుకొని తనకు కల్గిన జ్ఞానసంశయములను గూర్చి చందమామను అడగడమును తత్త్వరూపములో గలదు. చందమామ ఏమి వివరించుతాడో క్రింద చూచెదము.


  1) కాయమను పుట్టలోను చందమామ, పాము మాయగానే మెలగుచుండు చందమామ ||చం||

పాముల నివాసము పుట్టలని చాలామంది అనుకొనుట గలదు. పాముపుట్టలో ఉంటుందని పుట్టకు పూజలు చేయువారిని కూడ చూచునేయున్నాము. పుట్టలో పాము నివాసము చేయునట్లు మన శరీరము అను పుట్టలో ఆత్మ అను పాము నివాసము చేయుచున్నది.