పుట:Tatwamula vivaramu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్దమున్నది. "హం" అను శబ్దమునందు చివరిగా "మ్‌" అను శబ్దమున్నది. ఒక్కమారు శ్వాస లోపలికి పోయి బయటికి వస్తే "సోహం" అను మంత్రము ఏర్పడుచున్నది. అ సోహం మంత్రమునందే "ఓమ్‌" అను శబ్దము ఇమిడి ఉన్నది. కావున "సోహం" తల్లి "ఓమ్‌" శిశువు. "ఓం" ప్రపంచ పుట్టుకలో మొదటపుట్టిన శబ్దము కావున దీనిని ఆది మంత్రము అనుట సంభవించినది.


1) రెక్క ముక్కులేని పక్షి రేయి పగలు తపస్సు చేసి ఒక చెరువు చేపలన్ని ఒక్కటే మ్రింగెను. " ఆహా "

ముక్కు పుటములందు ప్రవేశించు శ్వాసకు ఆకారము లేదు కావున రెక్క ముక్కులేని పక్షి అని చెప్పబడినది. శ్వాస రేయి పగలు విడువక సోహం అను మంత్రమును జపించుచున్నది. కావున పక్షి రేయి పగలు తపస్సు చేసె అని చెప్పబడినది. ఈ శ్వాసయే శరీరము లోనికి ప్రవేశించి కుంభకము ద్వారా నిలిచి శరీరములోనున్న కదలికల (చైతన్యముల) అన్నిటిని నిలిపివేయుచున్నది. కావున చెరువులో అనేక విధములుగా చలించు చేపలన్నిటిని మ్రింగెను అని చెప్పబడినది.


2) ఇంటి వెనుక తుట్టెపురుగు ఇంటిలో అందరిని మ్రింగె, చూడవచ్చిన జనులనెల్ల చూచిమ్రింగెను. " ఆహా "

శ్వాస ఎల్లవేళల సోహం అను శబ్దము చేయుచున్నది కావున 'గీ' మని అరచు తుట్టెపురుగుగా చెప్పబడినది. శ్వాసకు ఆధారము శరీరములో కనపడక ఉన్న బ్రహ్మనాడిలోని చైతన్యము కావున ఇంటి వెనుక పురుగు అని చెప్పబడినది. ఇల్లు అనగా శరీరము. శ్వాస కుంభకము ద్వారా శరీరములోనున్న వ్యాన, సమాన, ఉదాన, అపాన