పుట:TELUGU-NAVALA.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు నవల

5

రామస్వామి. చిన్నతనంలో చదువుకోక చెడుసహవాసాలు చేసి, కుటుంబానికి అప్రతిష్ఠ, మనస్తాపం తెస్తూ ఉంటాడు. ఇతడి భార్య మహలక్ష్మి , విద్యావివేకాలు గల ముద్దరాలు. అన్ని విషయాలలోను సత్యవతినే ఆదర్శంగా చేసుకొని, కష్టాలనుభవించినా భర్తను సరియైన మార్గంలోకి తీసుకొని రాగలుగుతుంది. ఈ విధంగా స్త్రీ విద్యావంతురాలు కావడమే సంసారంలో ఇహలోకస్వర్గానికి ప్రాతిపదిక అని వీరేశలింగంగా రీనవల ద్వారా సాహిత్య ప్రబోధం చేశారు. నిర్బంధ వైధవ్యం, కన్యాశుల్కం, వృద్ధవివాహాలు, మంత్రతంత్రాలపట్ల, జ్యోతిషంపట్ల, ఉండే నమ్మకాలు పంతులుగారీ నవలలో విమర్శించారు.

ఆ రోజుల్లోనే యీ నవల, మలయాళ, అరవ, కన్నడ భాషలలోకి అనువాదం పొందడం, ఇది పొందిన ప్రాచుర్యానికి నిదర్శనం. ఈ నవల చదివిన వాళ్ళెందరో తమకు కూతుళ్ళు పుట్టినప్పుడు సత్యవతి పేరు పెట్టుకుంటూ వచ్చారని వీరేశలింగం స్వీయచరిత్రలో వ్రాశాడు. ఇంతకన్నా ఒక గ్రంథం పొందగల సార్థక్యంవేరే ఏముంటుంది.


ఇటుతరవాత వీరేశ లింగం ఆంగ్లమూలానికి అనుసరణంగా సత్యరాజా పూర్వదేశ యాత్రలనే నవల వ్రాశాడు. అయి ఇది మౌలికమైన గ్రంథం లాగానే తెలుగు పాఠకుల ఆదరణ పొందింది. ఇంగ్లీషులో జోనాధన్ స్విప్ట్ రచించిన 'గలివర్ ట్రావెల్స్' గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని వీరేశలింగం, రెండు భాగాల నవల వ్రాశాడు. ఒక భాగం లంకాద్వీపం. రెండోభాగం ఆడమలయాళం. సత్యరాజాచార్యులనే అతడి యాత్రావృత్తాంతకథనంగా యీ నవల సాగుతుంది. సత్యరాజాచార్యులు నిజమైన వ్యక్తి అని భ్రమపడి, ఆయన చిరునామా తెలియచేయవలసిందిగా కొందరు పాఠకులు వీరేశ లింగంగారికి లేఖలు వ్రాశారుట. అందువల్ల వీరేశలింగం యీ గ్రంథాన్ని ఎంత మౌలికంగా, ఎంత ఆకర్షణీయంగా రచించాడో అర్థంచేసుకోవచ్చు. ఆడమలయాళంలో ఎనిమిది ప్రకరణాలున్నాయి. ఈ ఎనిమిది ప్రకరణాలలోను మనదేశంలో స్త్రీల విషయమై జరుగుతున్న అన్యాయాలన్నీ , ఆడమలయాళంలో పురుషులకు జరుగు తున్నట్లు ఆరోపించి, బుద్ధిమంతులు సిగ్గుపడేట్లు వర్ణించారు. పురుషుల విషయంలో ఇటువంటి దురాచారాలు, దురన్యాయాలు పాటిస్తే ఆ సంఘం ఎట్లా ఉంటుంది అన్న ఆలోచనను రేకెత్తించడమే పంతులుగారి ఆశయం. భార్య చనిపోయిన భర్తలకు ముక్కులు కోయడం ఆడ మలయాళంలో సనాతన సంప్రదాయం.