పుట:TELUGU-NAVALA.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

తెలుగు నవల

శ్రీరంగరాజ చరిత్రం స్వకపోలకల్పితమైన రచన. చారిత్రకమైన పాత్రలు, ప్రదేశాలు స్వీకరించడంవల్ల, ఇతివృత్తం చారిత్రకమైనదేమో అనిపిస్తుంది కాని, జరిగిన కథ కాదనీ, కల్పించిందేననీ రచయిత ప్రస్తావించారు. సంఘంలో ప్రచురంగా కనబడుతున్న కులాచారాలు, కట్టుబాట్లు, నమ్మకాలు, ప్రసక్తానుప్రసక్తంగా రచయిత వర్ణించాడు. తెలుగు నవలారచనకు తొలి ప్రయత్నంగా దీన్ని భావించవచ్చు. గవర్నర్ జనరలైన మేయో కే దీన్ని అంకితం చేశాడు రచయిత. వీరేశలింగంకూడా తన నవలకు రాజ శేఖర చరిత్రమని పేరు పెట్టటం, సమకాలీన సంఘంలోని ఆచారాలు, మూఢవిశ్వాసాలు విమర్శించటం, శ్రీరంగరాజ చరిత్రం ఆయనపై కొంత ప్రభావం చూపిందనటానికి నిదర్శనాలు. వీరేశలింగం, శ్రీరంగరాజ చరిత్రం చదివాడు.


చిన్నయసూరి వదలి పెట్టిన విగ్రహతంత్రాన్ని వీరేశలింగం అనువదించి ప్రకటించినప్పుడు మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో పనిచేస్తున్న సమర్ధి రంగయ్య చెట్టిగారు, వీరేశలింగం ప్రతిభను మెచ్చుకొంటూ ఆయనకు అభినందన లేఖను వ్రాస్తూ తెలుగులో స్వకపోలకల్పితమైన వచన ప్రబంధ రచనకు మీరు పూనుకోలేరా? అని మెచ్చుకోలును సూచించే ప్రోత్సాహ వాక్యాలు వ్రాశాడు. వీరేశలింగం వచన ప్రబంధం వ్రాయటానికి పూనుకొన్నాడు. తెలుగులో తనకు మార్గదర్శకంగా వుండే గ్రంథాలులేవు. అందువల్ల ఇంగ్లీషు గ్రంథాన్ని దేన్నైనా అనువదించి తరవాత స్వతంత్ర రచన చేయవచ్చుననుకొన్నాడు.ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించిన ది వికరాఫ్ వేక్ ఫీల్డును ఎన్నుకొని, కొన్ని ప్రకరణాలు అనువదించేసరికి,విదేశీ వాతావరణము, పాత్రలూ, కథాగమనము ఆయనకు సంతృప్తి కలిగించలేకపోయినాయి. అందువల్ల స్థూలంగా కథను మాత్రం గ్రహించి దేశీయమైనవాతావరణంతో, పాత్రల పేర్లను మార్చి, తెలుగువాళ్ళకు ఆకర్షణీయంగా ఉండేట్లు రాజశేఖర చరిత్రం పేరున గ్రంథం పూర్తిచేశాడు వీరేశలింగం. అంటే రాజశేఖర చరిత్రం అనువాదం కాదు ఆంగ్లమూలానికి అనుసరణం అన్నమాట.

1878 వ సంవత్సరంలో, తాను నడుపుతున్న వివేకవర్ధని అనే మాసపత్రికలో ధారావాహికంగా ఈ నవలను ప్రచురించాడు వీరేశ లింగం. తరవాత 1880 వ సంవత్సరంలో పుస్తకరూపాన ప్రచురించాడు. రాజశేఖర చరిత్రంలో ఆ కాలపు తెలుగుదేశపు సమగ్ర స్వరూపం కనపడుతుంది. సాంఘిక జీవనమంతా ప్రతిభావంతంగా చిత్రించాడు వీరేశ లింగం సంఘంలో ఆనాడు ప్రచు-