పుట:TELUGU-NAVALA.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

తెలుగు నవల

భావ ప్రకటనలోనూ, నవ్యతతోపాటు. ఆలోచనను రేకెత్తించగల ధోరణీ కనపడతాయి.

శ్రీమతి మాదిరెడ్డి సులోచనగారి నవలలను అధిక సంఖ్యలో పాఠకులాదరిస్తున్నారు. అందుకే అవి సినిమాలుగా కూడా రావడం జరుగుతున్నది. లలితమైన భాష, కమనీయమైన కథాకథనమూ, ఈమె నవలలోని ఆకర్షణలు.

"అరవింద" గారు వ్రాసిన నవలలు తాత్విక చింతనను, లోతైన ఆలోచనను, వాస్తవిక చిత్రణకు భంగం కలగని విధంగా ఆదర్శోన్ముఖత్వాన్ని ప్రతిబింబిస్తాయి

మొత్తానికి ఇప్పుడు మహిళ లెందరో మంచి నవలలు వ్రాస్తున్నారు. ఇది సమాజాభ్యుదయానికి శుభసూచనం. ఈ పాతిక సంవత్సరాలలో పాఠకుల సంఖ్యను ఈ మహిళల రచనలు ఎంతగానో పెంచాయి. గత పాతిక సంవత్సరాలలో మంచిరచనలు మహిళలనుంచే, ముఖ్యంగా నవలా ప్రక్రియకు సంబంధించి వెలువడినాయనడం అతిశయోక్తి కాదు.

తెలుగు నవల పుట్టిన శతజయంతి జరిగినా, శిల్పవిషయంగా, కొత్త కొత్త ప్రయోగాలూ, నవ్యధోరణులూ, విశేషించి ప్రవేశించలేదు. ఉప్పల లక్ష్మణరావుగారి తరవాత డైరీల రూపంలో గంగినేని వెంటటేశ్వరరావుగారు "పాము-నిచ్చెన" పేరుతో ఒక నవల వ్రాశారు.

సుప్రసిద్ధ కథానికా రచయిత శ్రీ పాలగుమ్మి పద్మరాజుగారు “రామరాజ్యానికి రహదారి " "నల్లరేగడి" "రెండో అశోకుని మూణ్ణాళ్ళ పాలన" మొదలైన నవలలు వ్రాశారు. జాతీయోద్యమం నాటి తెలుగుదేశం గూర్చిన నవలలు తెలుగులో తక్కువే వచ్చాయి. శిల్పమూ, భాషా, భావతీవ్రత, సమకాలిక సమాజావగాహన విలక్షణంగా చూపగల మేథావివర్గ రచయిత శ్రీ పద్మరాజు.

విద్యార్థుల సమస్యలు, యూనివర్శిటి జీవితము, హాస్టళ్ళలో ఉంటూ, పెద్ద తరగతులు చదువుకొంటూ, సామాజిక జీవితానికి తమనుతాము తరిఫీదు చేసుకొనే యువతరం వారి ఉద్వేగ ప్రవృత్తులు, నవీన్ ఇటీవల ప్రచురించిన తమ "అంపళయ్య" నవలలో వర్ణించారు. ఇందులో ఆయన నవీన శిల్పాన్ని