పుట:TELUGU-NAVALA.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

తెలుగు నవల

దేశంలో పల్లెటూళ్ళలో ప్రచురంగా కన్పించే మంత్రవిద్యలూ, యోగవిద్యలూ బహుముఖీనమైన ప్రతిభతో ఆయన వర్ణించారు. తిక్కన సోమయాజి నవలలో శ్రీ రామలింగేశ్వరరావుగారు చూపిన ప్రజ్ఞ నిరుపమానమైనది. తిక్కన సోమయాజి, సమగ్ర మూర్తిమత్వాన్ని అత్యుదాత్తంగా, పరమోజ్జ్వలంగా ఆయన రూపుకట్టించారు.

స్వాతంత్ర్యానంతర తెలుగు సాహిత్యంలో ప్రత్యేకించి సగర్వంగా పేర్కొనవలసింది మహిళలు అధిక సంఖ్యాకంగా నవలలు వ్రాయడం. సంఘంలో వచ్చిన మార్పులు, ఆర్థిక సాంఘిక వ్యవస్థలలోని పరివర్తనలు, కుటుంబ జీవితంలో స్త్రీలు నేడు నిర్వహిస్తున్న పాత్ర, ప్రత్యేకించి స్త్రీల సమస్యలు, తరాల అంతరాలు, అత్యధిక శక్తిమంతంగా మహిళ లెందరో నవలలుగా రూపొందించారు.

స్వర్గీయ పి. శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు, స్వాతంత్ర్యానంతరం వెలువడిన నవలలో మంచి నవల. ఉద్యోగాలు చేసుకొంటున్న మహిళల సమస్యలు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలలో అంటి పెట్టుకొని వుండే అభాసపు విలువలు ఈమె ఈ నవలలో శక్తిమంతంగా చిత్రించారు. శైలి, భావవ్యక్తీకరణం, నవీనాలు.

శ్రీమతి మాలతీచందూర్ రచించిన చంపకం, చెదపురుగులు, రేణుకాదేవి ఆత్మకథ, మేఘాల మేలిముసుగు, లావణ్య, మొదలైన నవలల్లో ఆధునిక సమాజ స్వరూపాన్ని ఆవిష్కరింపచేశారు. ఈమె ప్రతిభావంతురాలైన రచయిత్రి. ఇటీవల ద్వివేదుల విశాలాక్షగారు గ్రహణం విడిచింది, గోమతి, వారధి, కొవ్వొత్తి మొదలైన మంచి నవలలు ప్రకటించారు. ఆలోచనాత్మకమైన ధోరణిలో, చురుకైన శైలిలో, వాస్తనిక సమస్యలను ఈమె నేర్పుతో చిత్రించగలరు

శ్రీమతి రంగనాయకమ్మ తిరుగుబాటు రచయిత్రి. బలమైన శైలి, తీవ్రమైన భావావేశం, కళ్ళముందు కనపడుతున్న సాంఘిక సమస్యలు, తరతరాల పురుషజాతి స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేకుండా జేసి, అవివేకంలో వాళ్ళను అన్యాయంగా వుంచడం, సంఘంలో రావలసిన మార్పులు, బలిపీఠం, కూలిన గోడలు, స్త్రీ, అంధకారంలో, చదువుకొన్న కమల, రచయిత్రి, మొదలైన తమ నవలల్లో వర్ణించారు.