పుట:TELUGU-NAVALA.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

35

దర్శించగలగటాన్ని, వీరి ఆలోచనను రేకెత్తించే విమర్శలద్వారా, అవగాహన చేసుకోవచ్చు. 1960 కి పూర్వమే శ్రీ సుదర్శనంగారు 'అనుబంధాలు' అనే మంచి నవలను వ్రాశారు. ఆటుతరవాత మళ్ళీ వసంతం అనే నవల వొకటి వీరిది వచ్చింది. ఇటీవల 'అసుర సంధ్య' అనే నవల వ్రాశారు. మనోవైజ్ఞానిక చిత్రణ, తాత్త్విక చింతన ఆలంబనంగా శ్రీ సుదర్శనంగారు పాత్రలను సృష్టిస్తారు.

శ్రీరంధి సోమరాజుగారి బాణే విలక్షణమైనది. భావుకుడు, సౌందర్య పిపాసి ఈయన. కళాకారుడి కుండవలసిన భావతీవ్రత సంయమనమూ కూడా పుష్కలంగా వున్న వాడు. ఆదర్శవాది. ఈయన వర్ణనలు కవితా ఖండికల్లాగా ఉంటాయి. ఎందుకు ఆలోచించరు? ఎందుకు సత్యాన్ని గ్రహించరు? ఎందుకు సమన్వయ దృష్టి నుండి దూరంగా తొలగిపోతారు? అనే తపన సోమరాజు గారి రచనల్లో ధ్వనిస్తుంది. 'ఆదర్శాలు అవరోధాలు' 'సౌందర్యం-సౌశీల్యం' 'దుఃఖితులు' సోమరాజు గారు వ్రాసిన చాలా మంచి నవలలు. ఈయన పరిశీలనా శక్తి అపారం పలుకుబడి విలక్షణం. “మీ బాధలు, మీ గాథలు అవగాహన నాకవు తయ్." అన్నట్లు, ఈయన పాత్ర చిత్రణ చేస్తారు. తన పాత్రలతో తనకేదో ఆత్మీయతా, తాదాత్మ్యభావమూ, తీవ్రమైన అనుభూతి దఘ్నంగా ఈయన రచనలుండటం వల్లనే, ఆ పాత్రలన్నీ సజీవంగా హృదయాన్ని తాకుతవి.

'హిత శ్రీ' రచించిన చిన్న నవలలు అంతర్వాహిని, సామాన్యుని కామన పేర్కొనదగినవి. మధ్యతరగతి కుటుంబపు విలువలను,సుతిమెత్తగా, హుందాగా, వ్యక్తీకరిస్తవి వీరి రచనలు. ఉత్తమ సంస్కారాన్ని, ఉదాత్తమైన భావాలను, దుర్భరంకాని వాస్తవికతలను ఈయన రచనలు ప్రతిబింబిస్తాయి.

ఇచ్ఛాపురపు జగన్నాధరావుగారి నవలలు 'గులాబిముళ్ళు' 'సుఖమూ- సుందరి' 'అందిన మేఘాలు' ' విజయ-శారద', మధ్యతరగతి కుటుంబాలలో అంతరికమైన ఉద్వేగాలు, భావుకతలు, ఇష్టానిష్టాలు, ప్రేమోద్విగ్నతలు, వర్ణించే నవలలు. మంచి పరిశీలనా శక్తి, కథాకథనాన్ని అందంగా నిర్వహించే నేర్పు, మానసికానుభూతుల ప్రకటీకరణశక్తి జగన్నాథరావుగారి రచనలలో కన్పిస్తాయి.

ఓగేటి శివరామకృష్ణ అనే రచయిత మధ్యతరగతి కుటుంబ గాథలను కథలుగా, నవలలుగా రచించారు. ఈయన వ్రాసిన 'మఱది' అనే నవల జాగృతి పత్రికలో ధారావాహికంగా పచురితమై పాఠకులను ఆకర్షించింది.