పుట:TELUGU-NAVALA.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

తెలుగు నవల

వాస్తవిక జీవితాలకు సంఘర్షణలు సమర్థవంతంగా చిత్రించాడు. చైతన్య స్రవంతి అనే శిల్పం, అధివాస్తవిక రచన మొదలైన ఆధునిక ఆంగ్ల సాహిత్యపు పోకడలను శ్రీకృష్ణరావు బాగా అర్థం చేసుకొన్న వాడు. ఈయన సృష్టించిన పాత్రల్లో చాలా వైవిధ్యం కనపడుతుంది. ఉత్తమ మధ్యతరగతి కుటుంబాల సమస్యలు, హైదరాబాదు నగర జీవిత వాతావరణమూ భాస్కరభట్ల నవలల్లో కానవస్తాయి

స్వర్గీయ శ్రీసింగరాజు లింగమూర్తి రచనలన్నిటా భావుకత, సృజనశక్తీ కల మధ్యతరగతి స్వీయ జీవితానుభవం నగ్నంగా ప్రత్యక్షమవుతూవుంటుంది. చాలా పరిశీలనాశక్తి ప్రతిభవున్న మంచి రచయిత శ్రీ లింగమూర్తి, నిరలంకారంగా, వాస్తవిక జీవితం తననుతాను ప్రత్యక్ష పరచుకొంటుంది. శ్రీ లింగమూర్తి నవలల్లో 'ఆకర్షణలో అపస్వరాలు', 'ఆదర్శాలు- ఆంతర్యాలు', 'రంగుల మేడ' వంటి మంచి నవల లెన్నో వ్రాశాడాయన. స్వాప్నికజగత్తులో విహరించడం, యౌవనపు సమస్యలు. ఆసక్తికరమైన మలుపులు లేకుండా సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు, అత్యంత వాస్తవికంగా చిత్రించగల నేర్పు శ్రీ లింగమూర్తిది.

శ్రీ పోతుకూచి సాంబశివరావు ఉదయకిరణాల నవల ద్వారా మంచి నవలా రచయితగా పరిచయమైనాడు. మధ్యతరగతి కుటుంబాల చైతన్యం, ఆశావాదం, సంఘర్షణలు, రాజీలు, కలలు, కలవరింతలూ, నేర్పుగా కళాత్మకంగా చిత్రించగల ప్రతిభ శ్రీ సాంబశివరావుది. ఏడు రోజుల మజిలీ, అన్వేషణ వంటి మంచి నవలలు ఈయన వ్రాశాడు. ఈ జంటనగరాల సామాజిక, సాంస్కృతిక చైతన్యజీవితమంతా, అన్వేషణ నవలలో సాంబశివరావు ప్రతిభా వంతంగా ప్రదర్శించాడు. 'అన్వేషణ' నవలలో విస్తృతమైన కేన్వాస్ మీద, ఆధునిక మానవ జీవితాన్ని, ఆర్థిక రాజకీయ నైతిక సమస్యలను , అనంతమైన వైవిధ్యాన్ని ఈయన దర్శించి ప్రదర్శించడం జరిగింది

తెలుగు నవలాసాహిత్యంలో మేధావి వర్గ రచయితగా శ్రీ ఆర్. ఎస్. సుదర్శనంగారికి సముచితమైన స్థానమున్నది. తత్త్వచింతన, ఆర్థిక సాంఘిక రాజకీయ సమస్యల, దృక్పథాల సమ్యగవగాహన, ప్రయోగశీలత, శ్రీ సుదర్శనం గారి ప్రత్యేకతలు. రచయితగా ఈయన చాలా ఎదిగిన వ్యక్తిత్వం కలవారు, సాహిత్య ప్రయోజనాన్ని , అనుభూతి తీవ్రతను ఏకదేశంగా కాక, పూర్ణంగా