పుట:TELUGU-NAVALA.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

33

తేలుతారు. అయినా జంతువులలో బుద్ధి, వివేచనాజ్ఞానం వున్నాయా? లేవా? అనే విషయం తేల్చాలంటే ఆయా జంతుజాతులు మాట్లాడుకునే భాషలు మనకు అర్థం కావాలి. వాటి భాషల జ్ఞానం మనకు లేకపోవటం చేత తేలికగా వాటిని బుద్ధి లేనివాటి క్రింద కట్టేస్తున్నాము. వాటిభాషలు మనకు యెలా అర్థంకావో, అలానే మనం మాట్లాడుకుంటున్న భాషలు పశుపక్ష్యాదులకు కూడా అర్థంకావు అందు చేత ఆవి మన్ని కూడా బుద్ధిలేని జంతువులని అనుకుంటే అనుకుంటూ వుండవచ్చు."

ఈ నవలలో శ్రీ తెన్నేటి సూరి ప్రకృతి వర్ణనలు పరమాద్భుతంగా చేశారు. తెలుగు నవలల్లో ఉత్తమోత్తమమైన పది నవలలను ఎన్నిక చేస్తే, సూరి వ్రాసిన యీ నవల మొదటి ఐదింటిలో ఉండకతప్పదు.

ఈ నవలను శ్రీ సూరి మంగోల్ ప్రజల చరిత్రను సముద్ధరించటానికి సర్వస్వం త్యాగం చేసిన హెన్రీ హెచ్. హేవర్త్ దంపతులకు అంకితం చేశారు. ఈ నవలకు రచయిత వ్రాసిన పరిచయం, అవశ్యం చదవదగినది. పండిట్ నెహ్రూ తన జీవిత చరిత్రలో 'Chenghiz Khan is my hero- చంఘిజ్ ఖాన్ నా ఆదర్శ వీరుడు'. అని వ్రాశారుట. తెలుగు సాహిత్యంలో శ్రీ సూరి పేరును శాశ్వతంగా నిలపటానికి ఈ ఒక్క నవల చాలు.

ఈ శతాబ్ది ఉత్తరార్ధం వచ్చేసరికి తెలుగు నవలలో కుటుంబ జీవనం ప్రధానేతివృత్తం అయింది. బలివాడ కాంతారావు మంచి నవలలు, నవలికలు - భారతి, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలలో ప్రచురించారు. గోడ మీద బొమ్మ, దగాపడిన తమ్ముడు, పుణ్యభూమి, సంపంగి, నాలుగు మంచాలు, వంటి మంచి నవలలు శ్రీ కాంతారావు ఎన్నో వ్రాశారు. ఆదర్శోన్ముఖమైన సామాజిక వాస్తవికతా చిత్రణం ఈయన నవల లన్నిటా కనపడుతుంది. మృదువైన భావన, అంతరికమైన వ్యక్తిత్వపు విలువలు, సుకుమారంగా సున్నితంగా శ్రీ కాంతారావు ప్రదర్శించగలరు. సజీవమైన రూపురేఖలతో, పాఠకుడి మనస్సుపై ముద్రవేసే పాత్ర చిత్రణం ఈ రచయిత ప్రత్యేకతగా చెప్పవచ్చు.

స్వర్గీయ శ్రీ భాస్కరభట్ల కృష్ణారావు వింత ప్రణయం, యుగసంధి, వెల్లువలో పూచిక పుల్లలు, భవిష్యద్దర్శనం వంటి మంచి నవలలు వ్రాశాడు. ఆధునిక జీవితంలో మధ్యతరగతి కుటుంబాల ఆశలు, ఆశయాలు, కోరికలకు,