పుట:TELUGU-NAVALA.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

31

నవల. భాషలో, భావ తీవ్రతలో, శిల్పంలో, తరతరాల నరజాతి చరిత్ర సమస్త విశ్లేషించిచూపడంలో, అనితరసాధ్యం నా మార్గం అంటుంది. యీ నవల ఇంగ్లీషులోనే దీనిని ఇంత గొప్పగా వ్రాయగలిగివుంటే (పాటలు, గేయాలు, మంచుగుట్టల వర్ణనల,గోబీ ఎడారిచలి, సూర్యోదయాస్తమాన వర్ణనలు, రెల్లు పూలు, పన్నెండో శతాబ్ది చైనాదేశపు సమగ్ర స్వరూపం, సంచార జాతుల సాహసాద్భుత జీవిత వృత్తాంతాలు, మంగోల్ జాతులన్నిటినీ సమీకృతం చేసిన మహావీరుడు,జగన్నియంత, భగవదంశ సంభూతుడుగా అరచేతిలో కకు డ్రేఖతో పుట్టినవాడని మంగోల్ జాతీయులు నమ్మిన చంఘిజ్ ఖాన్ మహా సాహసోద్యమాలను, ఇంగ్లీషులో వ్రాయకపోతే మానె. తెలుగు సాహిత్యంలో నవలకు, గొప్ప సేవ చేశాడు) అంతర్జాతీయ ఖ్యాతి, ప్రపంచ సాహిత్య బహుమానాలు తప్పక శ్రీ సూరి గెలుచుకొని వుండే వారు ఆయన ఎన్నేళ్ళు శ్రమించారో, మంగోల్ చరిత్రనంతా ఎంతగా పరిశోధించారో, ఎ దివ్యచక్షువులతో ఆ మహోజ్వల గాథ లన్నీ త్రవ్వి తీశారో, దర్శించారో, ఆ భావోద్విగ్నతను, ఆ ప్రజ్ఞను, ఆ వర్ణనలను, ఆ పాత్ర చిత్రణను తలచుకొంటే మహదానందం కలుగుతుంది. మహాద్భుత మనిపిస్తుంది. నివ్వెరపాటు ఆవహిస్తుంది. 'ఇతిహాసపు చీకటికోణం అట్టడుగునపడి కాన్పించని కథలన్నీ , కావాలిప్పుడు' అన్నాడు శ్రీశ్రీ. ధగధ్ధగాయమానమైన మణిని ఎత్తి తీశాడు సూరి. 'సదాపశ్యంతి సూరయః'-అని పెద్దలంటారు.

నరహంత, నరరూపరాక్షసుడు మహా క్రూరుడు అని చరిత్రకారులు కొందరు చంఘిజ్ ఖాన్ ను వర్ణించారు. ఒక్కొక్కడు ఒక మహాహంతకుడు- అని హంతకుల జాబితాలో చేర్చారు చంఘిజ్ ఖాన్ ను శ్రీశ్రీ కూడా. కాని ఈ నవల చదివితే ధర్మసంస్థాపనార్థం సంభవించినవాడు, అధర్మం అభ్యుత్థానం చెందినప్పుడు, దానిని రూపుమాపటానికి అవతరించిన మహావీరుడని, చంఘిజ్ ఖాన్ ను స్తుతించడానికి సందేహం కలగదు. ఈవిధంగా నిరూపించడానికి కావలసిన చారిత్రక సాక్ష్యాధారాలన్నీ శ్రీ తెన్నేటి సూరి పరిశ్రమించి సేకరించి అధ్యయనం చేసి, మహోజ్జ్వలమైన నవల వ్రాశారు. శ్రీ తెన్నేటి సూరి ఈ నవలను ఈ వాక్యాలతో ముగించారు. “పీడనవల్ల అగ్ని పుడుతుంది. 'చంఘిజ్ ఖాన్ ' దుర్భరమైన ప్రజాపీడనలో అవతరించిన జ్వాలా రేఖ. విధ్వంసకరమైన జ్వాలా