పుట:TELUGU-NAVALA.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

25

ప్రదర్శించగల నేర్పు వ్యక్తమవుతాయి. గోపీచంద్ భాషకాని, వాతావరణ చిత్రణం కాని, అత్యంత సరళ సుందరంగా, స్వభావసిద్ధంగా ఉంటాయి, మెరుగులు,అలంకారాలు పాండిత్య ప్రదర్శకమైన విరుపులూ ఏవీలేకుండా ఉదయకాలపు ఎండవలె, సాయంకాలపు ప్రశాంతత వలె, ఆయన శైలి అత్యంత సహజంగా ఉంటుంది. సమాజంలో వివిధ స్థాయులకు చెందిన వ్యక్తులను, ఆయన నవలల్లో పాత్రలుగా ఎన్నుకొన్నాడు. ఆధునిక నాగరకతలో పైఅంతస్తులవాళ్ళూ, పల్లెటూళ్ళలో ఆధునిక విద్యా, నాగరకతల గాలిసోకని వాళ్ళూ , కళాకారులూ, పత్రికా రచయితలూ పారిశ్రామికులూ, శ్రామికులూ, ఎందరో గోపీచంద్ నవలల్లో దర్శనమిస్తారు. అసమర్థుని జీవయాత్రలో సీతరామారావు, మెరుపుల మరకల్లోని రాధారాణి, వంటి పాత్రలు మరుపురానివి.

బుచ్చిబాబు భావనలో, భాషలో, ఇతివృత్త నిర్వహణంలో, వర్ణనలు చేయడంలో అన్నిటా కళాకారుడు. ఆయన రచనలన్నీ వర్ణచిత్రాల లాగానే ఉంటాయి. ఒకేఒక్క నవల వ్రాసినా తెలుగునవలా సాహిత్య చరిత్రలో బుచ్చిబాబు, స్థిరంగా నిలిచిపోగలగటం 'చివరకు మిగిలేది’ అనే ఆయన నవల విశిష్టతను చాటి చెపుతున్న ది. ఆయన శైలి మాటలను రంగుల్లో ముంచి కుంచెతో బొమ్మ గీసినట్లుంటుంది. ఆయనలోని సౌందర్య పిపాస, ఆయన ప్రకృతి వర్ణనలలోనూ, స్త్రీ పురుషుల ఆకృతి వర్ణనలలోనూ కనిపిస్తుంది. మనుషులు పరస్పరం ఎందుకు అసహ్యించుకుంటారు. మానవజీవితంలో అపశ్రుతులకు కారణాలేమిటి? అనే విషయాలను ఆయన తరచి తాత్త్విక జిజ్ఞాసతో తనచుట్టూ ఉన్న సంఘాన్ని పరిశీలించి పాత్రలను సృష్టించాడు. బుచ్చిబాబు స్వీయచరిత్ర లోని ఏక దేశమైన 'ఆంతరంగకథనం' చదివితే బుచ్చి బాబు పరిశీలన, భావుకతా దృష్టి, భావావేశం అర్థంమవుతాయి. 'చివరకు మిగిలేది' నవలలో ఆయన సృష్టించిన కోమలి, అమృతం, ఇందిర, సుశీల, దయానిధి, జగన్నాథం, చిరకాలం నిలిచిపోయే సజీవమైన పాత్రలు. ఆధునిక విజ్ఞానం, ఖండాంతర సాహిత్యరీతులు, తత్త్వచింతన అన్నీ ఆకళింపుచేసుకొన్న వాడు బుచ్చిబాబు. అత్యంత గహనమైన విషయాలు, లలితకళా రంగంలో వచ్చిన, వస్తూవున్న ప్రయోగాలు, అవగాహన చేసుకొన్న వాడాయన. రసెల్ , మామ్, ఇలియట్ , ల వంటి అధునికులేకాక షేక్స్‌పియర్ , కాళిదాసులు కూడా బుచ్చిబాబు మేధాసంపదను ప్రభావితం చేసిన వారే.