పుట:TELUGU-NAVALA.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

తెలుగు నవల

రూపొందించినట్లే చెప్పవచ్చు. కవిత్రయం వారి జీవితాలకు సంబంధించి నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి నవలలు, శ్రీనాథ పోతనల జీవితాలకు సంబంధించి కవిసార్వభౌముడు. కవిద్వయం నవలలు, ధూర్జటి మహాకవి జీవితానికి సంబంధించిన ఇటీవలి నవల ధూర్జటి, తెలుగు నవలల్లో చారిత్రక నవలా విభాగంలో చెప్పుకోదగినవి.

గొప్ప సాహిత్యవేత్తగా, మహాకవిగా తెలుగుదేశానికి పరిచయం కాక పోయినా యోగీశ్వరుడు, మంత్రద్రష్ట, తపస్వి వాసిష్ఠ గణపతిముని తెలుగులో నవలా రచనకు పూనుకోవడం ఆధునిక యుగంలో తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప విశేషం. ఈ నవలను ఆయన సంస్కృతంలో వ్రాయాలని మొదట్లో సంకల్పించి ప్రారంభించినా, తరవాత మనసు మార్చుకొని తెలుగులో ప్రారంభించి కొన్ని ప్రకరణాలు రచించటం తెలుగుభాషకు గొప్ప గౌరవం అని చెప్పాలి. గణపతిముని అత్యంతాధునిక దృక్పథం కలవారు. స్వాతంత్ర్యోద్యమంలో కూడా పనిచేశారు. తమిళనాడు కాంగ్రెసుకు స్వల్పకాలికంగా అధ్యక్షులుగా కూడా ఉన్నారని తెలుస్తున్నది. అంటరానితనాన్ని నిరసించారు ఆధునిక భారతదేశం అనుసరించవలసిన రాజ్యాంగాన్ని కూడా ఆయన సంస్కృతంలో రచించినట్లు తెలుస్తున్నది. గణపతి ముని గొప్ప జాతీయవాది, సంస్కృత భాషాభిమాని. అరుణాచల యోగిని రమణ మహర్షిగా లోకానికి వెల్లడి చేసింది గణపతిముని అని వారి జీవిత చరిత్రనుబట్టి తెలుస్తున్నది. గణపతి ముని సంకల్పించిన ఈ నవల ఆయన సంపూర్ణంగా రచించలేదు. రెండువందల ప్రకరణాలలో బృహత్తరమైన ప్రణాళికతో అనన్య సాధ్యమైన ఐతిహాసిక నవలగా ’పూర్ణ’ అనే పేరుతో ఈ నవల వ్రాయాలని గణపతి ముని సంకల్పం. కాని ముప్ఫై అధ్యాయాలు మాత్రమే ఆయన రచించటం జరిగింది. గణపతి ముని ఈ నవలను సంపూర్ణంగా రచించి ఉన్నట్లయితే, అఖిలభారతీయ భాషలలో దేనికీలేని విశిష్టమైన, అద్వితీయమైన ఘనగౌరవం తెలుగు సాహిత్యానికి లభించి ఉండేది. గణపతి ముని రచించిన ఈ 'పూర్ణ' నవలలోని ముప్ఫై ప్రకరణాలు సుప్రసిద్ధ సారస్వత మాసపత్రిక భారతిలో 1937 సంవత్సర ప్రాంతంలో అచ్చైనాయి. భారతి సంపాదకులు స్వర్గీయ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఈ నవలను నిరుపమానమైనదిగా ఆప్పుడు పేర్కొన్నారు. ముప్ఫై ప్రకరణాలు మాత్రమే ప్రచురితమై ఆగిపోయిన ఈ నవల ఇంచుమించుగా పాతిక