పుట:TELUGU-NAVALA.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

17

చేయడానికే చట్టాలన్నీ రూపొందాయనీ, యోగ్యులు, ప్రజాక్షేమపరాయణులు, దేశహితైకతత్పరులు, శాసనసభల ప్రాతినిధ్యం వహించి, శ్రీలు పొంగిన జీవగడ్డగా మళ్ళీ భరతదేశాన్ని రూపొందిస్తున్నారని, పాపం తమ కన్న కలను శ్రీ లక్ష్మీనారాయణ పంతులుగారు తమ నవల నాలుగోభాగం 18వ ప్రకరణంలో వర్ణించారు. లక్ష్మీనారాయణగారు అప్పటికే భాషా ప్రయుక్త రాష్ట్రవాదులు కనుక, ఆంధ్రరాష్ట్రం వచ్చేసినట్లూ, ఆ రాష్ట్ర శాసనసభ వారు ప్రజాక్షేమానికి సంబంధించి 12 చట్టాలు అమలులోకి తెచ్చినట్లు వర్ణించి తృప్తిపడ్డారు. లక్ష్మీ నారాయణగారు కన్న కలలను బట్టిచూస్తే స్వాతంత్ర్యం రాగానే భూతల స్వర్గం ఊడిపడుతున్నట్లే వారు భావించినట్లు కనపడుతున్నది. పాపం ఆ తరం వాళ్ళంతా అందువల్లనే గొప్పగొప్ప త్యాగాలు చేయటానికి వెనుదీయలేదు. ఉన్నవ లక్ష్మీ నారాయణగారు, వర్ణించిన ఆ శాసన చట్టాలు ఆ విధంగా అమలు జరిగితే, వారాశించిన విధంగా స్వరాజ్యం సురాజ్యంగానే రూపొందిఉండేది. మాలపల్లి నవల ఒక విజ్ఞాన సర్వస్వంవంటిది. మత, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, సాహిత్య సిద్ధాంతాలన్నీ పరామర్శితములై, వాటిలోని నిగ్గును ప్రదర్శిం చారు రచయిత. నూరు సంవత్సరాలకు పూర్వం తెలుగుదేశపు సామాజిక స్వరూపం ఏ విధంగా ఉండేదో, ఈ శతాబ్దపు ప్రథమపాదంలో, ఆ సమాజ స్వరూపం ఏ విధంగా పరిణామం చెందిందో, ఉన్నవవారు కళ్ళకు కట్టేటట్లు చిత్రించారు. భాష కాని, భావాలు కాని. నిర్వహణం కాని, పాత్ర చిత్రణం కాని, ఉత్తమ సాహిత్యవేత్తకు ఉండవలసిన భావోద్విగ్నత, సంయమనము, దర్శ నము, సందేశము, మొదలైన విషయాలలో కాని 'నాన్యఃపంథా ' ఉన్నవ వారిది, మాలపల్లికి సాటి అయిన నవల తెలుగులో నభూతో. భవిష్యత్తుమాట ఎవరు చెప్పగలరు ?

ఆధునిక తెలుగునవలా సాహిత్యాన్ని పరిశీలిస్తే చెప్పుకోదగిన నవలా రచయితలు నలుగురున్నారు. విశ్వనాథ, బాపిరాజు, చలం, నోరి నరసింహ శాస్త్రి. ఇంకెందరో నవలలు వ్రాసినవాళ్ళున్నారు. కాని ప్రత్యేకత చూపించుకొన్న నవలా రచయితలు ఈ నలుగురు. ఇదేవిధంగా 1940 వ సంవత్సరం నుంచి 1950 వ సంవత్సరం వరకూ పదేళ్ళలో బుచ్చిబాబు, గోపీచంద్, జి. వి. కృష్ణారావు, కొడవటిగంటి కుటుంబరావులను, విశిష్టులైన నవలా రచయితలుగా పేర్కొనవచ్చు. 1950 తర్వాత ఈ పాతిక సంవత్సరాలలో అత్యధిక సంఖ్యలో