Jump to content

పుట:TELUGU-NAVALA.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

15

విస్తూ ఉన్నవవారు ఈ నవల వ్రాసినట్లు చెపుతారు. ఈ నవల మొట్టమొదటిసారి ముద్రింపజేసిన ఘనకీర్తి శ్రీ బెల్లంకొండ రాఘవరావుగారిది. ఈయన గొప్ప సారస్వతవేత్త. గుంటూరు జిల్లా నరసారావు పేట దగ్గర పమిడిపాడనే అగ్రహారం వీరి కాపుర స్థలం. కవిపండిత మిత్రులుగా, వదాన్యులుగా ఈయన పేరుకెక్కారు. దీనికి కాశీనాథుని నాగేశ్వరరావుగారు పీఠిక వ్రాయడం కూడా చెప్పుకోదగిన విశేషమే. ఆనాటి బ్రిటిషు ప్రభుత్వం. ఈ నవలను ప్రచారం నుంచి నిషేధించడమేకాక , లభ్యమవుతున్న ప్రతులను జప్తు చేయటం కూడా చేసింది. మొదటిసారి వెలువడిన తరవాత చాలా కాలానికి గాని యీమహోత్తమ వచన కావ్యం పునర్ముద్రణ పొందలేదు.

సాహిత్యం జీవితానికి చేరువగా ఉండాలని, వాస్తవికతే దాని పరమాదర్శంగా ఉండాలని అనుకొంటే తెలుగులో ఇటువంటి నవల ఇంకొకటి రాలేదని చెప్పటం సత్యదూరం కాదు. ఈ నవలకు ఇంకొక ఇంగ్లీషు నవలకు పోలికలు చూపి, ఇది అట్లా ఉందని కొందరు విమర్శకులు గొప్ప పరిశోధన విషయం బయట పెట్టినట్లు ప్రస్తావించడం నిరుపయోగమూ, నిరర్థకమూ అని చెప్పాలి. ఏమంటే ఒకవేళ ఈ మహా విమర్శకులు చూపే పోలికలేఉన్నా, తెలుగు నవలగా దానికున్న విశిష్టతకు, ఉన్నవవారి స్వోపజ్ఞతకు కాని అవి అపకర్షకావు.

మాలపల్లిలోని పాత్రలన్నీ వాస్తవికమైనవి. వాస్తవిక ప్రపంచంలోని అనేక సంఘటనలు రసాత్మకంగా రూపకల్పన చేయటమే ఉన్నవవారి గొప్ప ప్రజ్ఞను నిరూపిస్తున్నది. అచలవేదాంతి తుంగదు ర్తి బుచ్చయ్యగారు, క్రిస్టియన్ ఫాదరీ బ్రాన్సనూ, ఆయన్ను ఆశ్రయించుకొని ఉండి సెటిల్మెంటు ఖైదీలపై ఆజమాయిషీ చేసే పౌలూ, ఆ రోజుల్లో రైల్వే స్టేషన్ లో యూరోపియన్ పద్ధతులను అనుకరించే, వంటవాడూ, అప్పుడప్పుడే మొదలవుతున్న నగరీకరణమూ , కూరలవాళ్ళూ, పాలవాళ్ళూ, మంగళాపురంలోని పూజారి పిచ్చయ్య, కరణం, మున్సబు ఒక రేమిటి, ఒక టేమిటి, ఈ శతాబ్ది ప్రథమ పాదంలోని తెలుగుదేశపు ప్రతిబింబం మాలపల్లి నవల.

ఇందులో ప్రధానమైన తక్కెళ్ళ జగ్గడి పాత్ర కూడా వాస్తవికమైన పాత్రే ఇటువంటి గజదొంగ ఒకడు ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలలో పెద్ద పెద్ద దొంగతనాలు చేసి అమరావతి వంటి చోట ఆలయంలో విశేషార్చనలూ, సంతర్పణలు చేసిన యథార్థ కథనాన్ని పెద్దిభోట్ల వీరయ్యగారు తమ