పుట:TELUGU-NAVALA.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

తెలుగు నవల

డానికి ముందుకాని, అటుతరవాత కాని, తెలుగునవలా సాహిత్యంలో అంతటి ఉత్కృష్టమైన నవల మరేదీ ప్రభవించి ఉండలేదు. తెలుగునవలా రచయితలలో ఆయన బుజాలఎత్తు వరకూనైనా నిలబడగల రచయిత లెవరైనా ఉన్నారో లేరో చెప్పడం కష్టం.

ఉన్నవ లక్ష్మీనారాయణగారు అకలంకదేశభక్తుడు. ఉన్నత విద్యాధికుడు. స్వార్థత్యాగి. ఉద్యమసారథి. మేధావి. హృదయవాది. గొప్ప పండితుడు. ప్రపంచ దేశాల రాజకీయోద్యమ తత్త్వవేత్త. సంప్రదాయాభిజ్ఞుడు. పాతకొత్తల మేలుకలయికను ఎరిగినవాడు. క్రొమ్మె రుంగులుజిమ్మగా ప్రదర్శింప గలిగిన శక్తి సామర్థ్యాలున్న వాడు.

ఉన్నవ వారు రచించిన నవల, మాలపల్లి, మహోత్తమ నవల. ఈ నవలకు సంగవిజయమని కూడా నామాంతరంవుంది. నాలుగు భాగాల నవల ఇది. పెద్ద సైజున ఏడువందల పుటలకుమించిన ఉద్గ్రంథం. ఇరవైయో శతాబ్దిలో వెలువడిన తెలుగు రచనలలో కనీసం కొన్ని వందల ఏళ్ళు జీవించగలిగిన నవల ఇది భక్తిజ్ఞాన కర్మ మార్గాల సమన్వయం సాధించిన నవల ఇది. తిలక్ గాంధీ సిద్ధాంతాల ఆదర్శసమన్వయం ప్రతిపాదితమైనది యీ నవలలో. సోషలిస్ట్ సిద్ధాంతా లను, దృక్పథాలను ప్రతిపాదించిన మొట్టమొదటి తెలుగు నవల, తెలుగు సాహిత్యంలో వెలువడిన మహోద్గ్రంథమూ, ఈ మాలపల్లి అని చెప్పాలి. వాస్తవిక చిత్రణ, ఆదర్శవాదము రెండూ అత్యద్భుతమైన శిల్పసమ్మేళనం పొందగా యీ మాలపల్లి నవల ఆవిర్భవించిందని చెప్పాలి. నిఖిలాంధ్రదేశానికి నడిగడ్డగా చెప్పదగిన గుంటూరు జిల్లా మెట్ట ప్రాంతం రంగ భూమిగా ఈ నవల రూపొందింది. ఈ నవలలో కనిపించే పాత్రలన్నీ సజీవంగా కనిపిస్తాయి. కల్పనవున్నా అది కల్పన అనిపించదు. ఇంతగా వాస్తవికత ప్రతిబింబించే తెలుగు నవలలు వేళ్ళ మీద లెక్క పెట్టదగినవి మాత్రమే ఉంటాయేమో. ఈ నవల తెలుగుదేశాన్నంతా చాలా గొప్పగా ప్రభావితం చేసింది. ఇది మొట్టమొదటిసారిగా 1921 వ సంవత్సరంలో వెలువడింది. ఆనాటి దేశకాలపరిస్థితులను తెలుసుకొంటే ఉన్నవ వారు ఆనాటికే యీ నవల వ్రాయటం, అద్భుతాద్భుతం అనిపించక తప్పదు. ఇతర భారతీయ భాషలలో ఆ కాలంలో ఇటువంటి మహోద్గ్రంథం వెలువడిందో లేదో ! తన సమకాలీన సమాజాన్ని, ప్రభుత్వ వ్యవస్థను, భూతద్దం క్రింద పరిశీలించి నట్లుగా చిత్రించాడు రచయిత. స్వాతంత్ర్యోద్యమంలో కారాగార శిక్షను అనుభ-