పుట:TELUGU-NAVALA.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

11

గ్రంథమాలను స్థాపించి దేవరాజు వేంకటకృష్ణారావు వాడేవీడు, నేను, కాలూ రాయివంటి నవలలను ఈ కాలంలోనే ప్రకటించారు. వెంకటపార్వతీశ్వరకవులు, చాగంటి శేషయ్య, దొరస్వామయ్య మొదలైనవారు బెంగాలీ నవల అనువాదాలు వెలయించారు. ముఖ్యంగా బంకించంద్ర ఛటర్జీ నవలలు కపాలకుండల, ఆనందమఠం, దుర్దేశనందిని మొదలైన నవలలు తెలుగులో అనూదితాలైనాయి. 1800 నుంచి 1929 వ సంవత్సరం వరకూ బెంగాలీ నవలల అనువాదాలు చాలా వచ్చాయి. ఇందులో సాంఘికాలూ, అపరాధ పరిశోధకాలూ ఉన్నాయి. చిలకమర్తి, వెంకటపార్వతీశ్వరకవులు, చారిత్రక, పౌరాణిక ఇతివృత్తాలతో నవలలు వ్రాశారు. భారతదేశ చరిత్రకు సంబంధించిన ఇంగ్లీషు అనువాదాలు కూడా యీ కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా రమేశచంద్రదత్, కల్నల్ టాడ్, మెడోస్ టైలర్ మొదలైన రచయితల నవలలకు అనువాదాలు వెలువడ్డాయి. విజ్ఞానచంద్రికామండలి, ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల, వేగుచుక్క గ్రంథమండలి మొదలైన ప్రచురణసంస్థలు నవలలను విశేషంగా ప్రచురించాయి.

క్రిందటిశతాబ్దపు చివరి దశకంలోనే దేశీయులు విదేశాలకు వెళ్ళి ఇంగ్లీషు చదువులు చదివి ఉన్నతమైన పట్టాలు పొంది ఈ దేశానికి వచ్చి ఘన గౌరవాలు పొందడం ప్రారంభమైంది. ఇంగ్లీషు చదువులపట్లా, వారి నాగరకతపట్లా, అభిమానం కూడా, వృద్ధికావడం మొదలైంది. అందువల్ల అంధానుకరణము. ఉద్యోగ వ్యామోహము, తమ స్తోమతుకుమించిన ఖర్చులు, మధ్యతరగతి కుటుంబాలను ప్రభావితం చేశాయి. కేతవరపు వెంకటశాస్త్రి గారి 'లక్ష్మీ ప్రసాదం' అప్పటి మధ్యతరగతి సంసారాల సాంఘిక జీవనాన్ని బాగా ప్రతిబింబించే నవల అని చెప్పాలి. 1920 వ సంవత్సరానికి ముందే యీ నవల వెలువడింది. విశాఖపట్టణ ప్రాంతాన్ని రంగభూమిగా, గొప్ప ఉపజ్ఞ చూపుతూ వెంకటశాస్త్రి గారీ నవల వ్రాశారు. మధ్యతరగతి కుటుంబ గృహస్థజీవనమూ, ఆచారాలు, వ్యవహారాలు, ఈ నవలలో రచయిత చక్కగా చిత్రించారు. లక్ష్మి అనే ముగ్ధ ఇందులో నాయిక. ప్రసాదరావు నాయకుడు. వీళ్ళిద్దరూ మేనత్త మేనమామ బిడ్డలే. లక్ష్మి తండ్రి రామశర్మ పాశ్చాత్య నాగరకతా వ్యామోహం లేకుండా గుట్టుగా సంసారం నడుపుకొనే గృహస్థు. ఆయన చెల్లెలు రాజేశ్వరమ్మ తన కొడుకును ఇంగ్లండ్ పంపించి ఐ. సి. ఎస్ చదివించి, కలెక్టరుగా ఆతణ్ణి చూడాలన్న విపరీతవ్యామోహం కలది. ఈ వ్యామోహంతో ఆమె ఉన్న వన్నీ