పుట:TELUGU-NAVALA.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

తెలుగు నవల

సాంఘిక జీవనంపట్ల తెలుగు ప్రజలు ఆకృష్టులైనారు. వాళ్ళను గురించి తెలుసు కోవాలన్న కుతూహలం కలిగింది. పురావైభవం, చారిత్రక పరిజ్ఞానం ద్వారా స్మరణకు తెచ్చి కర్తవ్యోపదేశం చేయాలనే ఉద్యమాలు కొన్ని దేశంలో బయలు దేరినవి. సాంస్కృతిక పునరుజ్జీవనం భారతదేశ వివిధ ప్రాంతాలలో ప్రారంభమైంది. విజ్ఞానచంద్రికామండలి ఈ దృష్టితోనే సంస్థాపనం చెందింది. దేశ దేశాల చరిత్రలు, స్వాతంత్ర్యోద్యమచరిత్రలు, శాస్త్రీయ విజ్ఞానం, విజ్ఞానసర్వస్వం, తెలుగువాళ్ళకందజేసే ఉద్దేశంతో పుట్టిన గొప్ప సంస్థ విజ్ఞానచంద్రికామండలి. వీరేశలింగం తల పెట్టిన సంఘసంస్కరణోద్యమాన్ని బహుముఖీనంగా, సమగ్రంగా, సమన్వయపూర్వకంగా, విస్తరింపచేయటమే విజ్ఞానచంద్రికామండలి లక్ష్యం.

దేశీయులలో స్వాతంత్ర్య పిపాసను పెంపొందించి, చైతన్యోన్ముఖులను చేయటానికే కొమర్రాజులక్ష్మణరావు హిందూమహాయుగం, మహమ్మదీయ మహాయుగం వంటి గ్రంథాలు రచించాడు. ప్రజలకు చరిత్రపట్ల అభిరుచి కలగటానికి విజ్ఞానచంద్రికామండలిద్వారా లక్ష్మణరావు చారిత్రక నవలలపోటీ ఏర్పాటు చేశాడు. విజ్ఞానచంద్రికామండలివారు పోటీలు నిర్వహించినందువల్లనే తెలుగుదేశంలో చారిత్రక నవలకు వికాసంకల్గింది. భోగరాజునారాయణమూర్తి, కేతవరపు వేంకటశాస్త్రి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య, మొదలైనవారెందరో ఉత్తమచారిత్రక నవలలు వ్రాశారు. భోగరాజు నారాయణమూర్తి వ్రాసిన ఆంధ్రరాష్ట్రము, విమలాదేవి మొదలైన నవలలు పాఠకులను బాగా ఆకర్షించాయి. ప్రాచీనాంధ్ర చరిత్రను ఔజ్జ్వల్యమొనర్చే నవలలు కేతవరపు వేంకటశాస్త్రి గారు వ్రాశారు. ఈయన రచించిన రాయచూరు యుద్ధం గొప్పనవల. శ్రీకృష్ణదేవరాయలు రాయచూరు యుద్ధంలో సుల్తానులను వోడించడం, వీరశృంగార అద్భుతరసాలతో కమనీయంగా వర్ణించారు రచయిత. 1900 నుంచి 1920 వ సంవత్సరందాకా సాగిన రెండో ఘట్టంలో వంగనవలల అనువాదాలు, చారిత్రక నవలలు, అపరాధ పరిశోధక నవలలు వెలువడ్డాయి. 1910 వ సంవత్సరంలో ప్రారంభమైన ప్రత్యేకాంధ్రరాష్టోద్యమం కూడా, తెలుగువాళ్ళ గత చరిత్రను అధ్యయనం చేసి నవలల రూపంలో అందించడానికి ప్రేరకమయింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వంటి ఆధునికరచయితలు కూడా చరిత్రను కొత్త దృక్కోణాలతో వ్యాఖ్యానించి ప్రతిపాదించారు. బరంపురంలో వేగుచుక్క