పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

369


మ.

సరసాన్నంబులు సూపముల్ ఘృతములు న్సౌరభ్యశాకంబులుం
బరమాన్నంబులు పిండివంటలు నపూపంబు ల్దధిక్షీరముల్
వరలేహ్యంబులు చోష్యము ల్మధుఫలవ్రాతంబులు న్మీగడ
ల్పరిపూర్ణ ప్రియత న్భుజించి రపు డాబాలాదు లామోదులై.

176


సీ.

ఇదె తృష్ణ దీర్ప నీయెద గల్గియున్న నిం
        పునఁ బయోధరకుంభముల నొసంగు
మదభిలాష లెఱింగి మన్నింపఁదలఁచితే
        లతిసుధారసఫలంబుల నొసంగు
నచ్చఱువయ్యె నాయిచ్చలో నీయెడఁ
        గల దతిరసరుచి తెలిసికొనఁగఁ
దగినట్టులున్నది తలఁచి చూచితిసుమా
        కారంబు నెచ్చట గానమిట్టు


గీ.

లనుచు నిజభాగగర్భోక్తు లినుమడించి
భుక్తిగొనువార లలర నర్మోక్తు లొసఁగి
సకలజనులకు భక్ష్యభోజ్యములఁ దృప్తి
గాగ వడ్డించి రాబోసకత్తె లపుడు.

177


మ.

పరిమోదంబున బండుటాకు మడుపు ల్బాగాలు పచ్చాకు న
త్తరుపన్నీరును జాపురా న్పునుఁగుగందంబు న్మృగీనాభి క
ప్పురము న్మేలగు సారసౌరభములు న్భూషాంబరంబు ల్ధరా
మరరాజోరుజశూద్రకోటికి బహూమానంబుగా నిచ్చియున్.

178


గీ.

మితదినాంతరమున తద్ధితపుణితిని
యిష్టకులదేవతాపూజలెల్లఁ దీర్చి
ప్రతిసరంబును విడి నిజబంధువృద్ధ
వితతికి నమస్కరించి దీవెనలు గాంచి.

179