పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

తాలాంకనందినీపరిణయము


మ.

గురురత్నంబుల గూర్చి దంపతుల కొంగు ల్ముళ్లు బంధించి భూ
సురకాంత ల్కపురంపుటారతులచే సొంపొంద వీణారవ
స్ఫురణ న్మంగళ మంచు వ్రీడ నగుమోము న్వంచి దీవించి పా
డిరి హస్తాంబుజకంకణక్వణనిరూఢిం దాళమానంబుగన్.

172


తే.

దినచతుష్టయ మిట్లు విధిప్రయుక్తి
వివిధమంత్రాహుతుల వ్రేల్వ వీతిహోత్రుఁ
డతులగతి దక్షిణావర్తనార్చి యగుచు
వెలిఁగె నుద్వాహసమ్మోదకలితుఁ డగుచు.

173


సీ.

నేత్రము ల్మెయినిండ నిండిజూచె బలారి
        యగ్ని తేజోమయుండై జెలంగె
కాలుఁ డుద్దండసంకాశుఁడై హర్షించె
        యాతుధానుఁడు తమిం బ్రీతినొందె
భువనోన్నతవిభూతి బొందె నవ్వరుఁణుండు
        ప్రవిమలామోదుఁడై పవనుఁ డలరె
కిన్నరేశ్వరుఁ డుబ్బె పెన్నిధి గనుమాడ్కి
        భవుఁ డుత్సవమున తాండవ మొనర్చె


తే.

నమరస ముదయ మెల్ల మిన్నంది బొంగె
నిలువుగన్నుల నప్సరోనివహ మరసె
భూనభోంతరముల నసమాన మగుచు
ఘనత జెలువొందుఁ బరిణయకాలమందు.

174


గీ.

వరుస నిబ్భంగి లౌకికవైదికప్ర
ధానహోమాదికర్మము ల్దగ నొనర్చి
హితపురోహితసుతమిత్రతతికళత్ర
సహితముగ భోజనోత్సవాసక్తు లగుచు.

175