పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

119


చ.

వనితను మీరు గూర్తురను వాంఛ నిరీక్షణ సేయ మత్ప్రియన్
ఘనకచయంచు మీరలుకగా మొగమెఱ్ఱన జేయనేల త
ద్ఘనమను వాచకార్థ మధికంబునకై ఘనవేణియై దగెన్
వినుఁ డిక యంచలార సతివేనలిచే ఘనముం జయించెడిన్.

184


సీ.

తలఁపగా ఘనవిరోధము వహించిన మీకు
        పరమహంసఖ్యాతి బరఁగు టెట్లు
పాటింప సరసుల భంగంబుగను మీకు
        మానసప్రేమ మైబూను టెట్లు
భువనజాత మడంచి పొడచి పెంపగు మీకు
        చక్రాంగనామంబు జరుగు టెట్లు
సత్యసంగతి విసర్జనజేసి మను మీకు
        శారదావాహాప్తి గోరు టెట్లు


తే.

ధరణి వెలిపుల్గులనుపేర దనరు మీకు
సద్విజులలోన బేరంద జాలు టెట్లు
గాన మీపేరు విన్నమాత్రాన నఖిల
విప్రయోగులు కడలేనివెతలఁ గనరె.

185


సీ.

ఘనవిముఖావాప్తి గల్గియుండుటె గాదు
        పంకజాతాసక్తిఁ బాలుపడుట
యప్రియవృత్తిచే నలరియుండుటె గాదు
        అచలరంధ్రాన్వేషణాప్తిఁ గనుట
వసుధనిజాత్యనువర్తనయే గాదు
        వాఙ్మాత్రమైత్రిభావమున గనుట
మానసోన్నతగర్వ మతిమెలంగుటె గాదు
        సంతతమందప్రచారు లౌట


తే.

తెలిసి శుచిపక్షులని సత్యనిలయు లనియు
మీదుముఖరక్తిఁ జూచి భ్రమించి సఖిని
గూర్తు రంచని నమ్మి నే నార్తిచే ను
తించితిని మిమ్ము నోరూర నంచలార.

186