పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

తాలాంకనందినీపరిణయము


దలఁచు నటంచు భీతి ధర దాగి మఱిం దలయెత్తి చూచు చె
ల్వలరఁగ రెల్లుగుంపు ధవళాస్తి రహించె దిగంతరంబులన్.

178


సీ.

సంపూర్ణరాజదర్శనసమాగతచక్ర
        పటువాహనాయుధభ్రాంతిదములు
భాస్వదిరమ్మదప్రమదాంగనిర్ముక్త
        శుచికంచుకాకారసూచకములు
తరణిఘృణీతప్తతారాపథవిలేప్య
        పాటీరపంకవిభ్రమకరములు
శుంభన్మరుత్కుంభికుంభాగ్రలంఘనో
        భీతమృగేంద్రమతిప్రదాయకములు


గీ.

సరసిజాకరకేళీగజవ్రజాంత
లోకనామాత్రజలపానలోలమేఘ
పటలభీతిపలాయితపటుమరాళ
నికరభావదములు శరన్నీరదములు.

179


వ.

ఇ ట్లఖిలసుమరజోవిసరధూసరభాసురంబైన శరద్వాసరంబు లవలోకిం
పుచు భూవల్లభుం డుల్లసితపల్లవభల్లప్రఫుల్లపల్లవభల్లంబుల నుల్లంబు
పల్లటిల్లం దల్లడిల్లుచు నిట్లనియె.

180


మ.

సరసీకేళివిహారముల్ సలుపు వాంఛన్ రాజహంసావళుల్
జరియింపం గని బూర్వవైరమున నొంచన్ లేక వెల్వెల్లనై
శరచాపంబులు బోనడంచి చపలేచ్ఛ న్మాని నీవీ వృథా
పరవిద్వేషత సంచరించుటిది దర్పంబౌనె శుభ్రాభ్రమా.

181


తే.

నిరతచపలవృత్తి నీరదవిఖ్యాతి
నలరు దీవు రాజహంసతతులు
సరసులందు మెలఁగి సారమెల్ల గ్రహించి
నిన్ను వెల్లఁజేయకున్న దెలియ.

182


వ.

అని రాజహంసలం గూర్చి యిట్లనియె.

183