పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

తాలాంకనందినీపరిణయము


త్కించిద్భేదము లేక శైశవశుభక్రీడావిహారంబుల
న్మించెం బంచశరప్రభాగరిమఁ బేర్మిం జెందె నానాటికిన్.

39


ఉ.

బొమ్మలపెండి లంచు విరిపుప్పొడిఁ దిన్నెలు బన్నియాడ మే
ల్బొమ్మయె నీకుఁ గోడలని బుత్తడి యీమొగబొమ్మ నాసుతుం
డిమ్మెయి దంపతీప్రతిమ లేర్పడఁగా మనకే సతీపతీ
త్వమ్ము లభించె నంచుఁ బ్రమదం బెనయంగ హసింతు రొండొరుల్.

40


ఉ.

లీలను బొట్టె చేడియలు లేగలపిండని తొంగియాడ నే
మేలగు కోడెదూడనని మేకొని రంకెలు వైచుచుం దమిం
బ్రేలుచు నందులోన శశిరేఖయే బల్సెలషెయ్య యంచుఁ బై
వ్రాలి యెదం బడుంగతిని బైకొను శైశవవేళ నీక్రియన్.

41


చ.

మఱియు నొకానొకప్పు డభిమన్యుఁడు నాశశిరేఖఁ జేరి క్రొ
మ్మెఱుఁగులపెన్నెఱు ల్ముడిచి మిన్నతిగా సిగవేసి తావిపూ
సరములుఁ జుట్టి బంగరుపిసారుజిలుంగుపయెంటఁ జేర్చి నీ
టరసి 'భళీరె' యంచు ముదమంది పసం దొనరించు నవ్వుచున్.

42


శా.

ఈలీలం జిఱుప్రాయఁపుం జెలులతో నిచ్ఛావిహారంబుఁగాఁ
బాలక్రీడలు సల్పుచుండఁ గని దత్పౌరాంగనల్ వేడ్క ని
బ్బాలారత్నము కీతఁ డీతనికి యీబాలామణిం దైవ మి
ల్లాలుంగాఁ దగకూర్చు టబ్బురమె యం చానందముం జెందఁగాన్.

43


ఉ.

పుత్తడిబొమ్మలో! పగడఁపు న్నునుదీవెలొ! క్రొమ్మెఱుంగులోఁ
జిత్తజుఁబువ్వుఁదూఁపులొ! శశిద్యుతులో! తులితస్వరూపసం
పత్తిని గాంచినట్టి బలభద్రసుభద్రతపఃఫలంబులో
నుత్తము లీకిశోరు లని యుత్సవమొందుదు ఱెల్లచూపరుల్.

44


45 నెం. పద్యము నుండి - 85 నెం. పద్యము నాల్గవచరణము సగ భాగము వరకు తా. ప్రతి శిథిలముగా గలదు.