పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాలాంకనందినీపరిణయము

ద్వితీయాశ్వాసము

కం.

శ్రీమహిళామలహృత్పుట
ధామా! ధామనిధిధామ! దళితారిజన
స్తోమా! దోర్దండబల
స్థేమా! శేషాద్రిధామ! దేవలలామా!

1


కం.

జయ జగదీశ్వర జనమే
జయజనపతి యడుగఁ బైలజటి బల్కెఁ దదా
శయ మెఱిఁగి మృదువచస్సం
చయమృదుమధురసుధ లధికఝరులై బొరలన్.

2


శా.

కుంతీసూనుల నిట్లరణ్యమునకుం గ్రోధాత్ముఁడై బంపి ని
శ్చింతం జెంది సుయోధనుం డతులితశ్రీగర్వదుర్వార వి
భ్రాంతాపస్మృతి మిన్ను మన్ను వివరింపన్ లేక నుద్యన్మదా
క్రాంతుండై కురురాజ్యసంపదల నేకచ్ఛత్రుఁడై యేలఁగన్.

3


చం.

శమనతనూజుఁ డిట్లనుప సాధ్వి సుభద్ర సుతోదయప్రమో
దము విడి మేఘనాదముదితంబగు గేకి ధనుర్ధ్వనిం భయ
భ్రమవడి బాఱినట్లరిగెఁ బట్టిని దోడ్కొని బుట్టినింటికిన్
రమణవియోగసాగరతరంగవిభంగనిజాంతరంగయై.

4


కం.

ఈరీతి వెతల సౌనా
సీరసతీమణి కుమారశేఖరుతో నా
ద్వారవతి కరుఁగుదెంచిన
సీరియు శౌరియుఁ బ్రియంపుఁ జెల్లెలఁ గనియున్.

5