పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72 తాలాంకనందినీపరిణయము


క.

శకుని సుయోధను బక్షము
నకు నిలిచి, తదక్షముల నణంగిన మాయా
వికటంబు గనక ధర్మజ్ను
డకుటిలమతితోడ జూద మాడ దొడంగెన్.

309


ఆ.

జూద మనుసరించి వాదముల్ ఖేదముల్
దగులు ననెడి రాజధర్మ మెఱిఁగి
బేల యగుచు బుద్ధి పెడతలఁబట్టె నిం
కేమిఁ జేయవచ్చు నీశ్వరాజ్ఞ.

310


క.

ఆడఁగ నాడఁగ, మఱుమా
టాడఁగనీకన్ సుయోధనాహ్లాదమె చే
కూడఁగ, ధర్మతనూజుం
డోడఁగ దొణఁగె న్వినిర్గతోత్సాహుండై.

311


సీ.

వేసారకను జూడు మీసారివ్రేటుచే
     నాసారెచేహూలు నడిపి గెలుతు
రేపాడనిత్తునా రాపాడి యికనైనఁ
     గాపాడ నీజోడు గదలఁ దీతు
నీ పట్టు లొకసారి నా పట్టుఁ జూడు నీ
     దాపెట్టు లేకుండఁ దరిమి పెడుదు
నీవంకఁ జూడకు నీవింక నిశ్శంక
     నీ బింకము లడంచి నిలువరింతు


తే.

ననుచు శపథోక్తులను జూద మాడ దొడఁగె
శకుని యవ్వేళ సుపథదుశ్శకునుఁ డగుచు
నిచ్చగల పందెములఁ దన కిచ్చుచుండ
సాధుబాధకుఁడైన దుర్యోధనుండు.

312