పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

81

మొదలుకొని మాయిరువురకును మైత్రి యారంభమై దినదినాభివృద్ధి నొందుచు రాఁగా, ఆయన యావజ్జీవనమును నాతోడిబద్ధసఖ్యము గలవారయి నేను బూనిన సమస్తకార్యములయందును నాకు సహాయులయి నాకుడిభుజమువలె నుండెడివారు. ఆయన యప్పటికి ప్రథమశాస్త్రపరీక్షయందుఁ గృతార్థులయి యానూతనసమాజమునకు కార్యదర్శిత్వము వహించిరి. ఆసామాజికులయొక్క ముఖ్యోద్దేశములు నీతివిషయములనుగూర్చి ప్రసంగించుటయు నుపన్యసించుటయు తా మాప్రకారముగా నడుచుకొనుటయు నితరుల నారీతిని నడిపించుటయు నయి యున్నవి. నే నాసమాజములో నొక సామాజికుఁడనుగాఁ జేరి, 1875 వ సంవత్సరము ఆగష్టు నెల 15 వ తేదిని "ఐకమత్యము" నుగూర్చి యుపన్యసించితిని. నాఁడు మొదలుకొని తప్పక ప్రతిభానువారము నాఁడును మధ్యాహ్నము మూడుగంటలకు ధవళేశ్వరమునుండి నాలుగుమైళ్లు రాజమహేంద్రవరమునకు నడచిపోయి సాయంకాల మాఱుగంటలకు సభ ముగిసినతరువాత మరల నొంటిగా ధవళేశ్వరమునకు నడచిపోవుచుండెడివాఁడను. జనోపయుక్తములైన సభలన్న నాకప్పుడంత యుత్సాహజనకములుగా నుండెడివి.

లౌక్యాధికారధూర్వహులయి యున్న వారిదుష్ప్రవర్తనములను వెల్ల డి చేయుచు వచ్చుటచేత నాకు విరోధు లంతకంత కెక్కువ కాఁ జొచ్చిరి. ఆకాలమునందు వేశ్యాప్రియులసంఖ్య మేర మీఱి యుండెను. ఆవిషయమయి నేను పత్రికలో మొట్ట మొదట పరుషము కాకుండ వ్రాసినదానిలోనికొన్ని పంక్తుల నిట నుదాహరించెదను జూడుఁడు - "ఈకాలముననో జారిణీసంభోగమే సత్కృత్యమని కొనియాడబడుచున్నది ; కట్టుకొన్న యాలిని దుఃఖపెట్టి, పరాంగనలఁ గవియువారు గథణీయులుగా నెన్నఁబడకున్నారు; మఱి లంజెలు లేనివారు పెద్దమనుష్యులే కారని గణింపఁ బడుచున్నారు; మీఁదు మిక్కిలి యేకభార్యావ్రతస్థులు పురుషులే కారనియు; నపుంసకులనియుఁ బరిహసింపఁబడుచున్నారు. ఎల్లరచే గొప్పవారని గౌరవింపఁబడుచున్న ధనికులయిన యధికారసులే వేశ్యలకింటిబంటు లయి, వారికి వశవర్తు లయి, యా