పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

స్వీయ చరిత్రము.

సంపన్న గృహస్థునిచేత పూజింపఁబడుచుండిన యొక యామె తా నొక యేకాదశినాఁడు బొందెతో స్వర్గమునకుఁ బోయెదనని చెప్పి యానాటిరాత్రి యెవ్వరును జూడకుండఁ బోయి గోదావరిలోఁ బడఁబోయెను. మహానుభావులని పేరు పడయుటకయి కొంద ఱాత్మహత్యకయిన సాహసింతురుగదా. గోదావరియొడ్డున పడవమీఁదఁ గూర్చున్న యతఁ డొకఁడు చూచి యామెను బట్టుకొని లోఁతునీటిలోనుండి దరి కీడ్చుకొని వచ్చి యింటికడఁ జేర్చెను. ఈసంగతి నుపవిలేఖకుఁ డొకఁడు వివేకవర్ధనికి వ్రాసెను. ఆలేఖ ప్రకటింపఁబడఁగానే కన్నెఱికముచేఁ బ్రసిద్ధి కెక్కిన మాన్యాయవాదిగా రాయోగినియందు భక్తితాత్పర్యములుగల పూర్వోక్తసంపన్న గృహస్థునిపక్షమున తమకాయుప విలేఖకునిపేరు వెంటనే తెలుపవలసిన దనియు లేనియెడల మాననష్టమున కయి యభియోగము తేఁబడుననియు నా పేర వ్రాసిరి. ఉపవిలేఖకుని పేరు తెలుపుటకు వలనుపడదని బదులు వ్రాసి, అభియోగము తెచ్చెడుపక్షమున స్వసంరక్షణార్థమయి యావ్యవహారమును ఋజువు పఱుచుటకు వలయుసాక్ష్యమును సమకూర్చితిని. వ్యవహారమునకు దిగినయెడల సత్యము బయలఁబడునని భయపడి ప్రతిపక్షు లభియోగము తేక యూరకుండిరిగాని తన్మూలమున ధవళేశ్వరములో నున్న యాసంపన్న గృహస్థునిమిత్రులకును నాకును వైమనస్యము సంభవించెను.

నేను ధవళేశ్వరములో నున్న కాలమునం దనఁగా 1875వ సంవత్సరము జూలయి నెలలో బసవరాజు గవర్రాజు గారు రాజమహేంద్రవరమునుండి నాయొద్దకు వచ్చి తాము నూతనము గా స్థాపింపఁబోవుచున్న "రాజమహేంద్రవర దేశాపాఠశాలాసమాజ" (Rajahmundry Provincial School Club) ప్రారంభదినమున నన్నక్కడకు రమ్మని యాహ్వానముచేసిరి. ఆయన రాజమహేంద్రవరములో మావీధినే నివసించువా రయినను, మాయిరువుర పెద్దలకును మైత్రియు భాంధవమును గలిగియున్నను, వీధిలో నొండొరులను జూచుచుండుటయేకాని మా కంతగా పరిచితిలేదు. ఆప్రథమసందర్శనదినము