పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

77

లును మాటాడుచుండుటకై యొకస్థిరమయిన సమాజముగా నేర్పడి నే నక్కడ నున్నంతకాలమును ప్రతిభానువారమునాఁడును సభలు జరుగుచు వచ్చినవి.

నే నప్పుడు పద్యములను వచనమువలెనే యాశుధారగాఁ జెప్పఁగలిగెడివాఁడను. అందుచేత ధవళేశ్వరములోని నామిత్రులు కొందఱు న న్నష్టావధానము చేయవలసినదని కోరిరి. వారికోరిక నంగీకరించి నేను కాపురమున్న వీణమువారిలోపల నొకదినమున కతిపయమిత్రబృందసమక్షమున అష్టావధానము చేసితిని. నా కది ప్రథమప్రయత్న మే యైనను, చూచినమిత్రుల నద్భుత ప్రమోదములపాలు చేసినది. అష్టావధానవార్త నాఁడే గ్రామమునం దంతట వ్యాపింపఁగా, ఆయూరనున్న యుద్యోగస్థులు మొదలయినవా రందఱును తమకుఁ దెలియనందునఁ దా మాదినమునఁ జూడఁ దటస్థింప లేదనియు నొంకొకసారి యష్టావధానమును బహిరంగస్థలములోఁ జేసి చూపవలసినదనియు, నన్నుఁ బ్రార్థించిరి. వారిమాట తీసివేయలేక పయివారమున మాపాఠశాలా మందిరమునఁ జేసెదనని చెప్పితిని. ఆసంగతి యెట్లో రాజమహేంద్రవరమువఱకును వ్యాపించి యప్పుడు (1874 వ సంవత్సరమున) నామిత్రులగు బ్రహ్మశ్రీ వావిలాల వాసుదేవశాస్త్రి గారిచేత నిట్లుత్తరము వ్రాయించినది. -

             "గీ. రాజమాన్యులు మఱి రాజపూజితగుణు | లాంధ్రగీర్వాణకవితావిహార
                 కందు|కూరి వీరేశలింగముగారి కడకు | లీల ధవళేశ్వరంబున స్కూలులోన.

              క. అష్టావధాన మేమో | తుష్టిని మీ రందుఁ జేయుదురటంచును నా
                 యిష్టసఖునిచే వింటిని | స్పష్టము గాఁ దెలియఁజేయవలయుం జుండీ."

నేను సంస్కృతమునందుఁగూడ ననుష్టుప్‌శ్లోకములు చేయ నారంభించితిని గాని నా కాభాషయందలి పాండిత్య మత్యల్పమయిన దని భావించి తరువాత మానివేసితిని. మొదట మాయిరువురకును పద్యరూపముననే యుత్తర ప్రత్యుత్తరములు నడచెడికాలములో నే నాయనకు వ్రాసిన యొక యుత్తరమునందు రెండుసంస్కృతశ్లోకములు చేసి వేసినందున పయిపద్యములోని భ్రమ యాయనకుఁ గలిగినది. నేను జేసిన సంస్కృతశ్లోకములు కొన్ని మద్వి