పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

స్వీయ చరిత్రము.

విద్యా విషయక ఖండనవాద మాంధ్రభాషాసంజీవనిని విడిచిపెట్టక యందే నెగడుచున్నను మండనవాదము మాత్రము పురుషార్థప్రదాయినినుండి తరలివచ్చి వివేకవర్ధనిని జేరినది. పత్రికాముఖమున నిట్లు మాటలపోరాటము జరుగుచుండఁగా దానివాసన ధవళేశ్వరమునందలి మహాజనులనుగూడ సోఁకి శీఘ్రముగానే యావాదమును ఫలోన్ముఖమునకుఁ దెచ్చినది. నేను ధవళేశ్వరమునందు సభలు చేసి బాలికావిద్యాభ్యాసమువలని లాభములనుగూర్చి పలుమాఱు ప్రసంగించుచు రాఁగా, మొదట వృద్ధఘటములలోఁ గొంత ప్రాతికూల్యము పొడ చూపినను క్రమక్రమముగా నడుగంటిపోయి కడకక్కడిప్రముఖుల కనేకులకు బాలికలకు విద్య యావశ్యక మన్న నిశ్చయము కలిగెను. కర్తవ్యతావిషయమున దృఢనిశ్చయము కలిగినతరువాత కార్యారంభమునకు తడవుపట్టదుగదా. అందుచేత నక్కడిప్రముఖు లందఱును తమలోఁ దాము చందాలు వేసికొని, 1874 వ సంవత్సరము సెప్టెంబరు నెలలో నొక బాలికాపాఠశాలను స్థాపించి దానికి బ్రహ్మశ్రీ మల్లాది అచ్చన్న శాస్త్రులవారిని ప్రధానోపాధ్యాయులనుగా నేర్పఱిచిరి. మ-రా-శ్రీ దాసరి రామన్న నాయఁడుగారు నెలకు నాలుగు రూపాయలచొప్పునను, ద్రోణమురాజు కృష్ణయ్యగారు రెండురూపాయలచొప్పునను, గాదిరాజు ప్రకాశరావుగారు మొదలయినవారు రూపాయలచొప్పునను చందాలువేసిరి. అప్పుడట్లు చందాలతో స్థాపింపఁబడిన యాబాలికా పాఠాశాల తరువాత స్థానిక సంఘమువారి సంరక్షణమునకుఁ బాత్రమయి యిప్పటికిని నవిచ్ఛిన్నముగా జరగుచున్నది. పురుషులలో సహితము విద్య యత్యల్పముగా నుండిన యాకాలములో నొకచిన్నగ్రామములోనివారు చందాలు వేసికొని బాఠశాలను స్థాపించిరనుట కొంత వింతగానే తోఁచవచ్చును గాని సత్కృత్య ప్రభావమును దలఁచినప్పు డసాధ్య మేదియు లేదు.

స్త్రీవిద్యయొక్క యావశ్యకమును గూర్చియు బాలికాపాఠశాలాస్థాపనమును గూర్చియు మొదట సమకూర్పఁబడిన యాసభలే తరువాత మతవిషయములును నీతివిషయములును దేశక్షేమాభివృద్ధులకు వలయు నితరవిషయము