పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

స్వీయ చరిత్రము.

శాస్త్రులవారు చెప్పియుండుటచేత, పాఠశాలాభవనములో నేను పరీక్షాప్రశ్నముల కుత్తరములు వ్రాయుచుండఁగా వారిరువురును గలిసి నాయొద్దకు వచ్చిరి. దొరగారు తమసందేహమును దెలిపినప్పుడు నాకు తోచినసమాధానము చెప్పఁగా, వారత్యంతసంతుష్టులయి వెడలిపోయిరి. వారి కప్పుడే నాయందు మంచియభిప్రాయము కలిగెను. సంక్షేపలేఖనపరీక్షయందుఁ గృతార్థుఁడ నగుటచేత నే ననుగతదండధాయి (Sub - Magistrate) పదమున కర్హుఁడనైతిని. రైవిన్యాసోన్నత పదపరీక్ష (Revenue, Higher Grade) కుఁ బోయి జయ మొందినయెడల సహాయకరగ్రాహి (Deputy Collector) పదమున కర్హుఁడనయి యుందును. ఆపరీక్షకప్పుడు రెండేపుస్తకములై నను నే నాశాఖయందుఁ బ్రవేశింపఁదలఁచుకోనందున, ఆపరీక్షకుఁ బోలేదు. వ్యావహారికోన్నతపదపరీక్ష (Civil, Higher Grade) యందుఁ గృతార్థుఁడ నైనయెడల, మొదటితరగతి న్యాయవాదిత్వమునకును అనుగత న్యాయాధిపతి (Sub - Judge) పదమునకునుగూడ నర్హుఁడనయి యుందును. న్యాయవాదిని గావలెనని తలంపు గొనియున్నప్పు డాపరీక్ష కొకసారి పోయినను, తరువాత నామిత్రులైన న్యాయవాదులు కొందఱు తమపనిలోను నిజమైన స్వతంత్రత లేదనియు, అందు న్యాయముగాఁ బ్రవర్తించి ధనార్జనము చేయుట యసాధ్యమనియు, తాము స్వయముగా సాక్షుల కసత్యము బోధింపకపోయినను సత్యము కానట్టు తెలిసియు సత్యమయినట్టు వాదింపవలసి యుండుననియు, చెప్పినందున న్యాయవాదిపదమునందును రోఁత పుట్టి రెండవసారి యాపరీక్షకుఁ బోవమానుకొంటిని. ఏపనియు లేక స్వతంత్రజీవనము నైనను చేయవలెను, లేదా పాపకార్యముల కంతగా నవకాశము లేని యుపాధ్యాయత్వమునం దైనను ఉండవలెను, అని నే నప్పుడు నిశ్చయము చేసికొంటిని.

మొట్టమొదట స్త్రీ విద్యామండనవాదము నన్యపత్రికాముఖముననే జరపుచు వచ్చినను, నాయూహలను లోకమునకు వెల్ల డించుటకయి స్వకీయమైన వృత్తాంతపత్రికయొకటి యుండుట యుక్తమని భావించి, 1874 వ సం