పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

69

బ్రతిదూషణముచేయఁ గడఁగితిని. పంతులవారు ప్రయోగించిన వాక్ప్రహరణము మృదుత్వము కలదిగాక మోటయి పైని బండదెబ్బకొట్టునదిగా నుండెడిది; నాది కొంతమార్దవము కలదగుటచేత వాఁడియయి లోఁతుగాఁ దూఱి మనస్సిన కెక్కువ నొప్పి కలిగించునదిగా నుండెడిది. ఆయన కృతివిమర్శనీ సమాజమని పేరుపెట్టి తామే మద్విరచితగ్రంధదోషాణ్వేషణమునకు దిగఁగా, నేను గుణాగుణప్రదర్శనీసమాజ మని పేరుపెట్టి తద్విరచితగ్రంథదోషాణ్వేషణములకుఁ గడఁగితిని. అప్పుడు క్రొత్తగా మిత్రులు గా నేర్పడిన బయపునేడి వేంకటజోగయ్యగారు మొదలయినవారు కొందఱు నా కీవాదమునందు సహాయు లయియుండిరి. ఈవాగ్యుద్ధమునందు సహితము నే నే జయ మొందితినని యప్పటివారనేకు లభిప్రాయపడినను, అప్పటి నా వ్రాఁతలు చూచిన నిప్పుడు నాకే సిగ్గగుచున్నది. నన్నెంద ఱెన్ని దూషణములు చేసినను, ఎన్ని పరిహాసములు చేసినను, ఈ కాలమునం దట్టివ్రాతఁలు వ్రాసియుండను. ఇరువురు తగవులాడుచుండఁగాఁ జూచుట పయివానికి వేడుకగానుండునుగాన, శుష్కకలహమును జంపివేయఁ జూడక యేదో పక్షముచేరి వివాదము పెంచుటకే పలువురు ప్రయత్నించుచువచ్చిరి. ఇట్లు పత్రికాముఖమున ఘోరవాక్కలహము నడచుచున్నను, పంతులవారును నేనును మనస్సులలోపల ద్వేషము లేనివార మయి పరస్పరసుహృద్భావముతో నుత్తరప్రత్యుత్తరములను జరుపుకొనుచునే యుండెడివారము.

1875 వ సంవత్సరమునందు నేను సంక్షేపలేఖన (Precis Writing) పరీక్షయం దింగ్లీషునఁ గృతార్థుఁడ నైతిని. ఈపరీక్షనిమిత్తము నేను రాజమహేంద్రవరమునకుఁ బోయి యుండినప్పుడే నా కచ్చటిరాజకీయ శాస్త్రపాఠశాలాధ్యక్షులగు మెట్కాపుదొరగారితోడి ప్రథమపరిచయము కలిగినది. ఆకాలమునం దాయన తెలుఁ గభ్యసించుచుండిరి. అప్పుడు వారి కేదో వాక్యార్థవిషయమున సందేహము కలుగఁగా, ఎవ్వరి నడిగినను తృప్తికరముగా తీర్పలేకపోయిరఁట. నే నాసందేహమును తీర్పఁగలనని యావఱకు కుప్పుస్వామి