పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

స్వీయ చరిత్రము.

యిరువురకును వాదమయ్యెను. ఇట్లావిషయమునఁ గొన్ని దినములు వితర్కము జరుగునప్పటి కాయన యేఁబదియేండ్లు దాఁటిన వృద్ధుఁడే యైనను, ఆయనకు సుముహూర్తాదులయందలి నమ్మకము ముక్కాలుమువ్వీసము పోయినది.

1870వ సంవత్సరమునందే "గోదావరీవిద్యాప్రబోధిని"కి నేను వ్రాయుచుంటినని తెలిపియున్నాను. కోరంగికిఁ బోకపూర్వము నేను రాజమహేంద్రవరములో నుండినప్పుడే మచిలీ బందరునందలి పురుషార్థప్రదాయినికి గ్రంథములు వ్రాసి పంపనారంభించితిని. నాపద్యకావ్యముల ననేకులు శ్లాఘించి యాకాలమునందలి వార్తాపత్రికలలో వ్రాసియున్నారు. నే నప్పటికి శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచననైషధమును, రసికజనమనోరంజనుమును, ముగించి శుద్ధాంధ్రోత్తరరామాయణమును జేయ నారంభించియుటిని. నా గ్రంధరచనను గూర్చి యింకొక ప్రకరణమునందు వ్రాయఁదలఁచుకొంటినిగాన దాని నిందు విడిచిపెట్టెదను. కోరంగికిఁ బోయినతరువాతఁగూడఁ బురుషార్థప్రదాయినికి వ్రాయుచునే యుంటిని. నేను రచియింప మొదలుపెట్టిన యచ్చ తెలుఁగు సభాపర్వములోని కొంతభాగము బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నముపంతుల వారిచేఁ జెన్న పట్టణములోఁ బ్రకటింపఁబడుచుండిన యాంధ్రభాషాసంజీవనిలోఁ బ్రచురింపఁబడినది. నేనక్కడనున్న కాలములో విశేషపరీక్షలలో నొకటియగు రెండవతరగతి భాషాంతరీకరణపరీక్ష (Translation, Lower Grade)కు 1872వ సంవత్సరము ఆశ్వయుజమాసములో ఇంగ్లీషు తెలుఁగు భాషలయందుఁ బోయి కృతార్థుఁడనైతిని. మొదటితరగతి భాషాంతరీకరణ పరీక్షకుఁ బోవువారు రెండుదేశభాషలను నేర్చియుండవలెను. ఒక్క యల్పాంశము తక్క నే నచ్చటనున్న కాలములో విశేషముగాఁ జెప్పవలసినదేదియు లేదు. నాతల్లికి పిశాచభ్రమ యుండుచువచ్చెనని మొదటిప్రకరణముననే చెప్పితిని. ఆమె కాభ్రమము పూర్ణముగాఁ బోవక మరణకాలమువఱకు నప్పుడప్పుడు కలుగుచునే యుండెడిది. కాని నేను దయ్యములవిషయమునఁ దఱచుగా సంభాషించుచువచ్చుటచేత 1876 సంవత్సరమునకుఁ దరువాతమాత్రము