పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

63

దైవజ్ఞులును బంధువులునుగూడ నాతో బహువిధములఁ జెప్పిరి. ఎవ్వ రెన్ని విధములఁ జెప్పినను వారిమాటలు చెవినిబెట్టక యేమిజరగునో చూతమని యాచె ట్టట్టే యుంచితిని. ఆరంభదశలోఁ గొంతకాలము గుంపులుగుంపులుగావచ్చి జను లావింతనుజూచి పోవుచువచ్చిరి. కొన్ని నెలలకు కాయ లెదిగి కూరకక్కఱకువచ్చినతరువాత కాయలు కోసికొని దూటనిమిత్తము చెట్టు కొట్టివేయించితిని. ఆసమయమునందే మాయింటిదూలముయొక్క కొన నున్న తొఱ్ఱలో తేనె పట్టుపట్టెను. ఇంట తేనెపట్టుపట్టఁగూడదనియు, అట్లు పట్టుట యశుభసూచకమనియు, దానిని తీసివేయించి దోషపరిహారార్థముగా బ్రాహ్మణులచేత శాంతికర్మ చేయింపవలసినదనియు, ఎల్లవారును పై యట్లే చెప్పిరి. పై యట్లే మొండొడ్డి యెల్లవారిహితబోధలను నిరాకరించి చలింపక చట్టువలె నిలిచితిని. నాతల్లియు ముత్తవయుఁగూడ నాతోఁ జెప్పిచూచిరి గాని యీబండవానితోఁ జెప్పినకార్యము లేదని తుదకు విసిగియూరకుండిరి. మండలపాఠశాలలోని పని నిలిచిపోయినతరువాత నాకు 1872వ సంవత్సరము జ్యేష్ఠమాసములో కోరంగియను గ్రామమునందుఁ గల యింగ్లీషుపాఠశాలలో నెలకు ముప్పదిరూపాయల జీతముగల ప్రధానోపాధ్యాయత్వము లభించినది. ఆపనికిఁ బోవునప్పుడు మంచిదినముచూచి మంచి ముహూర్తము పెట్టుకొని పొమ్మని యితరులును మావారునుగూడ నన్ను బలాత్కారము చేసిరి. వారి నిర్బంధమును లక్ష్యము చేయక యమావాస్యనాఁడు బైలుదేఱిపోయి పనిలోఁ బ్రవేశించితిని. ఆపాఠశాలకుఁ గార్యనిర్వాహకులుగానున్న యిరువురిలో నొకరు మాతాతగారియొద్ద కొలువులోనుండిన యాతనికుమారుఁడును చుట్టమును సముద్రశుల్క పర్యవేక్షకుఁడును (Sea Custom Superintendent) అగు బలిజేపల్లి నారాయణమూర్తిగారు. పోఁగానే నేను వారియింట నే దిగితిని. అమావాస్యనాఁ డేల బైలుదేఱితివని నన్నాయన యడిగెను. ఈశ్వరుఁడు చేసిన దినములన్నియు సమానముగానే మంచివయినప్పు డేదినమున బైలుదేఱిన నేమని నేను బదులుచెప్పితిని. అందుపైని జ్యోతిశ్శాస్త్రవిషయమున మా