పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

51

నోయను భీతిచేత నిల్లు తనపేరవ్రాయించుకొన్నతఁడు దానితోఁ జేరినస్థలములో నిండ్లు కట్టింపకయే మృతుఁడయ్యెను. పండ్రెండేండ్లు గడచినతరువాత నాతనిభార్య యందులో గృహములు కట్టించి యిప్పు డద్దెల కిచ్చినది. నా పెదతండ్రిగారిభార్య యిప్పటికిని సజీవురాలయి నాకంటె నెక్కువదార్ఢ్యము కలదయి యున్నది.

ఈకాలమునకే నేను తెలుఁగున కవిత్వము చెప్పుట కారంభించితిని. మతమునకు నీతిప్రధానమనియు, నీతిమాలినవాఁడు నిజమైనభగవద్భక్తుఁడు కాఁ జాలఁడనియు, చిత్తశుద్ధిగలిగి యీశ్వరానుగ్రహమును బడయుటకు నీతిపరుఁడైయుండుట యావశ్యకమనియు, నేను మొదటినుండియు నమ్మియుండిన వాఁడనైనను, నే నేకేశ్వరోపాసకుఁడను గాక యప్పటివఱకు విగ్రహారాధకుఁడనైయే యుంటిని. అప్పుడు నాకుపవాసములును వ్రతములును భగవత్ప్రీతికరములనియే నమ్మకముండెను. ప్రత్యేకాదశినాఁడును గోపాలస్వామి యాలయములోనిభజనకుఁ బోయి రాత్రులు ప్రొద్దు పోయినదాఁక మేలుకొని యుండి యింటికి వచ్చు చుండెడివాఁడను; శివరాత్రినాఁడు ప్రాతఃకాలమున కోటిలింగ క్షేత్రమునకుఁబోయి స్నానముచేసివచ్చి నిరాహారుఁడనై ప్రదోష సమయము మొదలుకొని రాత్రి యెంతో ప్రొద్దుపోయినదాఁక మార్కండేయస్వామి యాలయములో కాలక్షేపముచేసి వచ్చెడివాఁడను; ఒక శివరాత్రినాఁడు జాగారము సహితము చేసితిని. కవిత్వము చెప్పుట కారంభింపఁగానే మొట్టమొదట గోపాలస్వామిమీఁద నొకటియు, మార్కండేయస్వామిమీఁద నొకటియు, రెండు కందపద్యశతకములను జెప్పితిని. ఆరెండుశతకములును చిరకాలము క్రిందటనే యెట్లో నశించినవి. అవి యిప్పుడున్నను ప్రశస్తముగా నుండియుండవు గాని చిన్న ప్పటికవిత్వ మెట్లుండెనో తెలిసికొనుటకుమాత్ర మాధారములైయుండును. వీనిలో మొదటిది మార్కండేయశతకము; దానిలోఁ బ్రతిపద్యాంతమునందును "మార్కండేయా" యని యుండును. రెండవది గోపాలశతకము; దానిలోఁ బ్రతిపద్యాంతపాదమును "శ్రీరాజమహేంద్ర