పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

స్వీయ చరిత్రము.

ము పుట్టకపోవుటచేత నది చెల్లఁదగినదిగాక ధర్మశాస్త్రప్రకారము జరగనట్లే భావింపఁబడ వలసినదనియు, ఎమేమో హేతువులు చెప్పి యభియోగపత్రమును వ్రాసి దానిపైని నాచేత వ్రాలు చేయించి, అనుగతన్యాయసభలో వ్యాజ్యము వేసెను. అప్పుడు నాకు వ్యవహార మేమో ధర్మశాస్త్ర మేమో తెలియనే తెలియదు. మాయింటితీర్పంతయు నా తల్లియే చక్క పెట్టుచుండెను. న్యాయాధిపతి విచారణచేసి యావఱకు జరగినది క్రమమయినవిభాగమే యనియు, అభియోగము తేవలసినక్రమ మదికాదనియు, ప్రతివాది యనంతరమున గృహస్వామ్యమునిమిత్తము వ్యాజ్యము తెచ్చుకోవలసిన దనియు, అక్రమముగా నామె తనపైని చేయించుకొన్న తీర్పులను రద్దు పఱుచుటకయి వేఱుగ వ్యాజ్యములు తెచ్చుకోవలసినదనియు, వ్రాసి మావ్యాజ్యమును కొట్టి వేసెను. అంతటితోనైన నూరకుండక యాన్యాయవాదియే మండలన్యాయసభలో దానిపై నుపర్యభియోగము చేయించెను. మండలన్యాయాధిపతి దానిని సహితము కొట్టివేసి రెండు న్యాయసభలలోను ప్రతివాదికైన కర్చు లిచ్చుకో వలసినదని తీర్పు చెప్పెను. ప్రతివాది కిచ్చుకోవలసిన కర్చులక్రిందను న్యాయవాది కిచ్చినవియు ముద్రకాగితములకైనవియు నైనవ్యయములక్రిందను నాభార్యకుండిన నాలుగైదువందల రూపాయల నగలను విక్రయింపవలసి వచ్చినది. తదనంతరకర్తృత్వము నిమిత్తమును, అన్యాయముగా పొందిన తీర్పులను రద్దు పఱుచుకొను నిమిత్తమును,వ్యాజ్యములు తెమ్మని న్యావాదులుమాత్రమే కాక యితరులును నన్ను ప్రేరణచేసిరి. అప్పటికి నేను స్వతంత్రుఁడ నయి సంపాదింప నారంభించి యుండుటచేతను, వ్యవహారములకెక్కి వ్యర్థముగా ధనవ్యయము చేయుట నా కిష్టము లేకపోవుటచేతను, నాపక్షమే తీర్పు పుట్టినను నాజీవితకాలములో నా కాసొత్తువచ్చుట సందేహమగుట చేతను, నేను మరల వ్యాజ్యములలో దిగలేదు. స్థిరద్రవ్యము విషయమయి యక్రమముగా పొందిన తీర్పులను రద్దుచేసికొనుట కప్పటి న్యాయశాసనమునుబట్టి పండ్రెండేండ్లు గడువుండినందున, ఈలోపల నే నెప్పుడు వ్యాజ్యము తెత్తు