పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

39

ఆకాలమునందు నే నసత్యము నెన్నఁడును బలుక లేదని చెప్పఁజాలను. అప్పుడు నే నాడిన యొక యసత్యమునుగూర్చి యిందు వ్రాయక విడుచుట న్యాయము కాదు. ఆకాలమునం దిరువదిరూపాయలకు మించిన దొరతనమువారి యుద్యోగముల కర్హులనుగాఁ జేసెడిది సామాన్యపరీక్ష యని యొకటియుండెను. అది యింగ్లీషును, తెలుఁగును, రెండు వేఱు వేఱుశాఖలు కలదిగానుండెను. విద్యార్థు లింగ్లీషులోఁ గాని, దేశభాషలోఁగాని, ఉభయభాషలలోనుగాని పరీక్షకుఁ బోవచ్చును. ఈ పరీక్షయందుఁగాని సర్వకలాశాలాప్రవేశపరీక్షయందుఁగాని కృతార్థు లైనంగాని యెవ్వరును విశేషపరీక్షలకు పోఁగూడదు. సామాన్య పరీక్షాప్రశ్న పత్రములను జూచినప్పుడు నా కవి సులభములుగా కనఁబడినందున నా కాపరీక్షకుఁ బోవలెనని యత్యంతకుతూహలము కలిగెను. అయినను నా యుద్యమమున కొక్క ప్రతిబంధ మప్పు డనివార్యమై యడ్డుపడెను. పదునెనిమిది సంవత్సరములు దాఁటినవారుగాని యాపరీక్షకు పోఁ గూడదు. నా కప్పటికి పదు నెనిమిది సంవత్సరములు నిండలేదు. అప్పుడు నాకు నాజన్మసంవత్సర మేదో తెలియకపోయినను, నాజన్మపత్రమును నే నెన్నఁడును జూచి యుండక పోయినను, నాకు పదు నెనిమిదేండ్లు దాఁట లేదనిమాత్రము నే నెఱుఁగనివాఁడను గాను. అయినను శీఘ్రముగాఁ బరీక్షాసిద్ధుఁడను గావలెనన్న బాల్య చాపలముచేత నేను పరీక్షకు పోవుట మానక నావయస్సు పందొమ్మిది సంవత్సరములని కాఁబోలును ప్రార్థనాపత్రమునందు వ్రాసి పంపితిని. ఇంగ్లీషువైద్యుఁడు సహితము నేను స్ఫోటకపడితి ననియు నావయస్సు పందొమ్మిది సంవత్సరము లనియు నిర్ణయపత్ర మిచ్చెనుగాని యంతమాత్రముచేత నేను దోషిని గాకపోను. ఆసంవత్సరమే నే నుభయభాషలలోను పరీక్షాసిద్దుఁడనై, ఉత్తర సర్కారులలో కృతార్థులైనవారలో రెండవవాఁడనై నిలిచితిని. ఇట్లు పరీక్ష యందు చరితార్థత నొందుటగాని వైద్యపట్టము నందిన రాజకీయోద్యోగి పరీక్షించి పందొమ్మిది సంవత్సరములని నిర్ణయించుటగాని నన్న నృతదోషము నుండి రక్షింప నేరదు. ఆకాలమునందు బుద్ధిపూర్వకముగా నాడిన యసత్య