పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

స్వీయ చరిత్రము.

ధేయములనుజదివినప్పు డధికసంఖ్యగల బాలురు నాపేరు వ్రాసినట్లేర్పడెను. ఎవ్వరి పేరైనను వ్రాయుమని కోరినప్పుడు బాలురు సాధారణముగా నున్నత వర్గములోని వారిపే రొకటి వ్రాయుట స్వాభావికము. అట్టి స్థితిలో పై తరగతిలోని వారి నందఱిని విడిచి పెట్టి విద్యార్థులు దిగువ తరగతిలోనున్న నన్ను పేర్కొనుట వారికి నాయెడలఁగల సదభిప్రాయమును సూచించుచున్నది. సద్వర్తనముకొఱకై యొక బహుమానము నియ్యఁ దలఁచుకొని దొరగా రిట్లు పేరులువ్రాయించిరి. ఆబహుమానము నాకేవచ్చినదని చెప్పనక్కఱయుండదు. అప్రయత్నముగా వచ్చిన దగుటచేతను సత్ప్రవర్తనమును గూర్చినదగుట చేతను నా కాబహుమాన మిప్పటికిని నధికప్రీతికరమై యున్నది. ఆదొరగారు పదిరూపాయల విలువగల పుస్తకములు నన్నుఁ గోరుకొమ్మన్న ప్పుడు పై తరగతికిఁ గావలసిన పుస్తకములను నిఘంటువు నొకదానిని నేను గోరుకొంటిని. ఆనిఘంటువుపై దొరగారు స్వహస్తముతో వ్రాసిన వ్రాఁతను జూచుకొన్నప్పుడెల్లను నాకు సంతోషము కలుగుచుండును. అందుచేతనే నాకు బహుమానములుగా వచ్చిన యితర పుస్తకముల నన్నిటిని బోఁగొట్టుకొన్నను సద్వర్తనము నిమిత్తమయి బహుమానముగా నియ్యఁబడిన యా నిఘంటువునుమాత్ర మిప్పటికిని పదిలముగా భద్రపఱిచియున్నాను. ఈ దొరగా రింగ్లండుదేశ చరిత్రమును హిందూదేశచరిత్రమును రచియించి, ఉపకారవేతనమునొంది యింగ్లండునకు బోయినతరువాత హిందూదేశమునందుండిన ఘనులవృత్తాంతములు మొదలైనవి వ్రాసి యిప్పటికిని సజీవులయియున్న ప్రసిద్ధపురుషులు. ఈదొరగారు మా గోదావరిమండలములో న్యాయాధిపతులుగా నుండినంతకాలమును సద్వర్తనమునకై ప్రతిసంవత్సరమును విద్యార్థులకు బహుమానము లిచ్చుచు వచ్చిరి. కాని తరువాత తరువాత ధనికులుగాను ప్రబలులుగాను నుండిన యనర్హులు సహితము విద్యార్థులను ప్రార్థించియు పీడించియు తమ పేరులు వ్రాయించుకొనుచు వచ్చుటచేత నట్టిబహుమానములయందలి గౌరవ మంతకంతకు తగ్గి పోవుచువచ్చినది. విద్యార్థులు నాయం దిట్లు సదభిప్రాయముగలవారై యుండినను