పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

స్వీయ చరిత్రము.

నట్టియు మొదటినుండియు నాకు మందు లిచ్చుచుండినట్టియు గండ్రాపు వెంకన్న గా రనెడు వైద్యశిఖామణి నాకు కూరగాయవైద్యము చేయుచువచ్చెను. ఏదైననేమి? వ్యాధిని కుదిర్చినదే దివ్యౌషధము. తుద కాయన వైద్యము వలననే దేహస్వాస్థ్యము కలిగినది. నే నప్పుడు జీవించుట యతిమానుషమైన పరమాద్భుతకర్మ మని యాయన యే పలుమాఱు నాతో ననుచు వచ్చెను. 1865 వ సంవత్సరారంభమున నాకు వ్యాధి నిమ్మళించినను, తరువాతఁ గొన్ని నెలలకుఁ గాని జవసత్త్వములు గలిగి పాఠశాలకుఁ బోవ శక్తుఁడను గాకుంటిని. ఆసంవత్సరము వేసవికాలపు సెలవు లయినతరువాత దొరతనము వారిమండలపాఠశాలయం దావఱకు విడిచి పెట్టిన మూఁడవతరగతిలోనే నేను మరలఁ బ్రవేశించితిని. నా కప్పుడు గల మేధావిశేషమునుగూర్చి యీ వఱకే సూచన చేసియున్నాను. నే నాఱుమాసములే యాతరగతిలోఁ జదివినను సంవత్సరాంతమునందు జరిగినపరీక్షలో నేనే మొదటివాఁడ నైతిని. సంవత్సరపరీక్షలో నాకు వచ్చినసంఖ్య నాతరువాతివానికి వచ్చినదానికంటె నూఱు హెచ్చుగా నుండెను. ఇందులకుఁ గారణము పాఠపుస్తకమును నే నొక్కసారి చదువఁగానే యందలివిషయము లన్నియు నాకు ముఖస్థములయి తత్కాలమునకు స్ఫురణకు వచ్చుచుండుటయే. సంవత్సరపరీక్షయందాతరగతి కేర్పఱుపఁబడిన పరమసంఖ్య 360. ఈసంఖ్యలో మూడవవంతుకు తక్కువ కానిసంఖ్యను దెచ్చుకొన్న విద్యార్థుల నందఱిని పరీక్షాసిద్ధులనుగా పరిగణించి పైతరగతికిఁ బంపి, బాలురు తెచ్చుకోవలసినదానిలో నల్పిష్ఠ సంఖ్యయైన మూడవవంతును (120) తెచ్చుకోనివారి నందఱిని మరలఁ బూర్వపు తరగతిలోనే యుంచుచుండెడివారు. ప్రతిబాలునకును తనతరగతిలో సంవత్సరము పొడుగునను వచ్చెడిసంఖ్య నంతను మొత్తముచేసి, అందఱిలో నధిక సంఖ్యను దెచ్చుకొన్న బాలుని సంఖ్యను సంవత్సరపరీక్షా పరమసంఖ్యతో (360) సమ్మనముగాఁ జేసి, తక్కినవారిసంఖ్యలను యథాభాగములుగా తగ్గించుచుందురు. ఇట్లి చేసినప్పుడు నావి యాఱునెలల సంఖ్యలే యగుటచేతను తక్కినవారివి