పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

35

నాయంతరాత్మవలనిబాధచేతనే యని చెప్పలేనుగాని యే హేతువుచేతనో యీపని జరిగిన శీఘ్రకాలములోనే చేసిన నేరమునకు దండనమో యనునట్లు నాకు వ్యాధి యారంభ మయినది. ఒక్కసారి భగవన్నామస్మరణము చేసిన మాత్రముననే యీజన్మమునఁ జేసినవేగాక బహుజన్మసంచితములయిన సమస్త పాపములును నిర్మూలములగునన్న యప్పటి నావిశ్వాసమువలన నిత్యమును దేవతాసందర్శన సంస్మరణములు చేయుచుండెడి నా కాయల్పదుష్కృతదోష మప్పుడే పోయెననియే నమ్మకము కలిగెను. అందుచేత నంతరాత్మ నన్ను బాధించుట మానివేసినది. అయినను నా వ్యాధిమాత్రము తగ్గక యంతకంతకు వృద్ధినొంద సాగినది. నాకు శైశవమునుండియు నుండిన దగ్గునకు తోడుగా నజీర్ణాతిసారరోగములుకూడ నన్నా శ్రయించినవి. ఇంగ్లీషువైద్యులును తెలుఁగు వైద్యులునుకూడ బహుమాసములు నా కనేకౌషధము లిచ్చిరిగాని యెవరి మందువలనను రోగ మించుకయు నివారణముకాలేదు. శరీరములోని రక్తమాంసములు హరించిపోయి శల్యావశిష్టుఁడనై నేను పూచికిపుడకవలె నయితిని. వ్యాధి యసాధ్యమైనదని భావించి, నాజీవితాశలేనివారయి తామే మాట దక్కించుకొనుట కిష్టములేక చికిత్సమానుకొని యొకరితరువాత నొకరుగా వైద్యులందఱు నన్ను చేయివిడిచిరి. నాబంధువులు మొదలగు నెల్లవారును నాబ్రతుకునందు నిస్పృహులయి యిఁక మనుష్య ప్రయత్నమువలనఁ గార్యము లేదని దైవపరులయి యుండిరి. ఈప్రకారముగా 1863 వ సంవత్సరాంతము నుండి 1864 వ సంవత్సరాంతమువఱకును నేను మరణజీవితములమధ్య నూఁగులాడుచుంటిని. ప్రతినిమిషమును మృత్యుదేవత నన్ను నోరవేసికొని పోవఁ జూచుచుండియు నే నొక్కొకబళమునకయినను జాలనని యేమో విడిచి పెట్టుచుండెను. నే నప్పుడు మృత్యుముఖమునుండి వెలువడి మరల భూమిపై నడుగుపెట్టఁ గలుగుట నిర్హేతుకజాయమానమైన యీశ్వరానుగ్రహవిశేషము వలననే కాని యౌషధప్రభావముచేతఁ గాదని చెప్పవచ్చును. ఘనవైద్యులు నన్ను విడిచి పెట్టినతరువాత మాయింటి సమీపముననే వాసము చేయుచుండి