పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

31

వాత నాపాలికి వచ్చిన గృహములోనే నాజనని నాకువేఱుగ వంటచేసిపెట్ట నారంభించెను. ఇట్లు పృథగ్భాండాశనము చేయుచున్నను, నాపెదతండ్రిగారు మాకు సర్వవిధముల సాయము చేయుచునే యుండిరి. ఎట్లు చేయకుండఁ గలుగుదురు? కన్న ప్రేమకంటె పెంచినప్రేమ యెక్కువగదా! మేము వేఱుపడినట్లు సహిత మితరులకు తెలియకుండవలెననియే యాయన యభిమతము. గృహ కలహములచేత తల్లిని బిడ్డను గొంతకాలము వేఱుగ నుంచవలసి వచ్చినదని యాయన యడిగినవారితోఁ జెప్పుచువచ్చెను. ఒక కాగితముమీఁద వస్తువులపట్టికను వ్రాసిసంతకములు చేయించుటయే కాని దానిని ముద్రకాగితముమీఁద వ్రాయనేలేదు. దాయవిభాగమునమావశ్యకమైన విభాగపత్రమును వ్రాయలేదు. ఆపట్టికను నాపెదతండ్రిగారు తనయొద్దనే యుంచుకొనిరి. ఈవిభాగము లయినతరువాత కొలఁదికాలములోనే నా పెదతండ్రిగారు తమయుద్యోగధర్మమునుబట్టి గ్రామాంతరమునకుఁ బోవలసినవారయిరి. అంతటితో తొంటికుటుంబకలహములన్నియు నంతరించినవి; కుటుంబయజమూనునకును తదితరకుటుంబస్థులకును గూడ మనశ్శాంతియు నైసర్గిక ప్రేమానుబంధదృఢత్వమును మరల దినదినక్రమమున వర్థిల్లఁజొచ్చినవి. అవిభక్తకుటుంబములలో నంతఃకలహము లుద్భవిల్లి యైకమత్యము చెడి సుఖభంగము గలిగినప్పుడు కుటుంబ స్నేహమును మరల నెలకొల్పుటకు వేఱుపడుటయే యుత్తమసాథనము. వేఱు వేఱుగా దూరమున నుండుటచేత నొండొరులతోడ తగవులాడుట కవకాశముండదు. తగవులాట లెప్పుడుండవో యప్పుడే యావఱకు శోషిల్లి ప్రాణావశిష్టమయి యుండిన స్వాభావికస్నేహలత నిర్మూలముగాక పునరుజ్జీవనమునొంది యల్పకాలములోనే తలయెత్తి కాలక్రమమున కొనలుసాగి వర్ధిల్లి ఫలప్రదమగును. కలిసి యుండినప్పు డైకమత్యమును బరస్పరానురాగమును లేనివా రనేకులు విభక్తులయినతరువాత బహుకుటుంబములలో మరల నన్యోన్యమైత్రిని బడసినవారయి పరస్పరసహాయులయి సుఖించుచున్నారు. నాభాగమునకు వచ్చినయిల్లు చెన్నపురివంటి స్థలములో నుండె నేని నెలకు నలువది యేఁబది రూపాయలయద్దె