పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

స్వీయ చరిత్రము.

హకథలనెల్ల మరలఁ ద్రవ్వుకొని ద్విగుణముగా వాక్కలహమునకు డీకొని నోరు నొప్పియెత్తువఱకును పోరాడి యలసి రాత్రి గృహ యజమానునకు నివేదింపవలసిన క్రమమును యోచించుచు నప్పటి కూరకుందురు. ఇట్టి గృహచ్ఛిద్రములు నిత్యకృత్యములయి గృహమరణ్యసదృశమయినప్పుడు గృహపతికి మనశ్శాంతి యెక్కడిది? గాఢనిద్ర యెక్కడిది? సుఖ మెక్కడిది? నా పెదతండ్రిగారికి నాయందుఁ గల ప్రేమమునకు పరిమితిలేదు. అందుచేత నన్ను వేఱు పెట్టి యసహాయస్థితిలో నుంచుటకాయన కణుమాత్రము నిష్టము లేకుండెను. ఆయన నన్నుఁజూచి యెన్నియోసారులు కన్నుల నీరుపెట్టుకొని దుఃఖింపఁ జొచ్చెను. ఎంత దుఃఖించిన నేమికార్యము? కుటుంబకలహమును మాన్పి నెమ్మదిని గలిగించుటకు చరస్థిరరూపమైన ద్రవ్యమును విభజించి యిచ్చి నన్ను వేఱు పెట్టుటకంటె నుపాయాంతర మేదియు నాయన మనస్సునకు గోచరము కాలేదు. నాజననియు సొత్తు పంచియిచ్చి తమ్ము వేఱు పెట్టవలసినదనియే కోరుచుండెను. అదియే యప్పటి కాయనకును యుక్తమని తోఁచెను. నా పెదతండ్రిగా రొకసారి భాగములు పంచుటకు వస్తువులపట్టికను వ్రాయవలెనని కూరుచుండి, చేతులాడక కంట తడిపెట్టుకొనుచు కాగితమును కలమును క్రిందఁ బడవైచి గదిలోనికిఁ బోయి మంచముమీఁదఁ బరుండి దుఃఖింపఁ దొడఁగెను. ఈదుఃఖపాటంతయు నాయనకు నామీఁదఁ గలయవ్యాజాను రాగముచేతనేకాని స్వాధీనమయి యున్న సొమ్ము పంచియియ్యవలసి వచ్చునన్న విచారముచేత లేశమునుగాదు. సొత్తు పంచియియ్యక కలహము లడఁగుజాడ కనఁబడలేదు. అందుచేత మరలఁ గొన్ని దినముల కాయన 1862 వ సంవత్సరము ఆగష్టునెలలో నొకనాఁడు నాభార్య మేనమామను మఱియొక బంధువును మాత్రము పిలిపించి వారి నొద్ద నుంచుకొని భాగములపట్టికను వ్రాసి నాసగ పాలు నాకిచ్చి వేసెను. నావంతుకు మేడగల పెద్దయిల్లోకటియు, మున్నూఱు రూపాయల వెలగలపాత్రసామగ్రియు, నాలుగైదువందల రూపాయల వెండి బంగారపునగలును, ఏఁబదియైదు రూపాయల ఋణమును వచ్చెను. అటుతరు