పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

381



నాజీవచరిత్రమును వ్రాయనెంచిన మిత్రుని జీవచరిత్రమును నేనే యాయన స్మృతిని శాశ్వతపఱుచుటకయి చేయఁబడిన పురమహాజనుల సభలోవ్రాసి చదువవలసినవాఁడనైతిని. నేను వ్రాసిన సంక్షేప చరిత్రమువలన నీమహాపురుషుని గుణసంపదకొంతవఱకు తేటపడవచ్చును. ఈయనస్మృతి స్థిరీకరణార్థమయి దాదాపుగా మున్నూఱురూపాయలు చందాలు వేయఁబడినవి; వేసినవారిలో కొందఱు తక్క మిగిలిన వారందఱును తాము వేసిన చందాలను సంతోషపూర్వకముగా నిచ్చిరి. వచ్చిన సొమ్ముతో నాది కొంతచేర్చి మున్నూటయేబదిరూపాయలకు నిజరూపపరిమాణముగల చిత్రాకృతిని వ్రాయించి రాజమహేంద్రపురమందిరమునందుఁ బెట్టించితిని. ఎవరివలన మదుద్దిష్ట కార్యనిరంతర వ్యాప్తియు లోకోపకారమును కలుగునని నేనాశపడియుంటినో యట్టి వారిలో నకాలమరణము నొందుట కీయన ప్రథములు; ఈయనయనంతరము నాతరువాత నిరంతరాయముగా నత్యంతోత్సాహముతో లోకోపకారకార్యమును నడుపుదురని నేను ప్రతీక్షించిన రెండవవారయిన సత్తిరాజు మృత్యుంజయరావుగారును వీరివలెనే యకాలమరణమునొంది నాయాశకు భంగము కలిగించిరి; ఆరంభింపఁబడిన సత్కార్యము నవిచ్ఛిన్నముగా జరపి లోకమునకు మేలు చేయుదురని నేనాశపడిన, కడపటివారయిన దేశిరాజు పెద బాపయ్య గారును పయి యిరువురివలెనే యకాలమృత్యుదేవతవాతం బడిరి. వీరు మువ్వురును పట్టపరీక్షాసిద్ధులు; దేశాభిమాన మాననీయులు; సత్కార్యానుష్ఠాన దీక్షాపరులు; స్వార్థపరిత్యాగులు; పరోపకారరతులు; తాము సత్యము లని నమ్మినవాని నాచరణమునకుఁ దెచ్చుటయం దుత్సాహమును ధైర్యసాహసములును కలిగిన కార్యశూరులు. వీరు మువ్వురును యౌవనమధ్యమున స్వకృత్యాచరణారంభదశలో నే స్వర్గస్థులయిరి. ఈలోకములో మంచిపదార్థములు చిరకాలముండవు కాఁబోలును! ఆహా! ఈశ్వరేచ్ఛా విచిత్ర ప్రభావముల నెవ్వరు గ్రహింపఁగలరు!