పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380

స్వీయ చరిత్రము.



లెప్పటివలెనే యున్నను కార్యములకు సమర్థముగాకయున్న నాప్రస్తుతావస్థను దలఁచుకోఁగా, పూర్వపు వీరేశలింగముగాక తచ్ఛాయావిగ్రహము మాత్రమే నిలిచియున్న దేమో యన్నట్టు తోఁచుచున్నది. తొల్లిటి క్రియాశక్తిలో కొంతయయినను నాకీశ్వరుఁడు మరల ప్రసాదించునుగాక!

ఇన్ని విషయములలో నే నత్యంతోత్సాహముతో పని చేయుచుండిన కాలములో నాయుత్సాహమునకు భంగకరమైన వైపరీత్య మొకటి తటస్థించెను. మిత్రభావముతోనే కాక గురుభావముతో నేను చెప్పినదాని నెల్ల శిరసావహించి చేయుచు, నాకు కుడిభుజమయి యుండి నేను పూనిన సమస్త సత్కార్యములలోను తోడుపడుచు, స్వభావ దుర్బలుఁడనైన నన్ను శ్రమపడకుండ సదాకంటిని ఱెప్పవలెఁగాచుచు, వాగ్దానములుచేసినవారును ప్రతిజ్ఞలు పలికినవారును అందఱును విడిచినను తానుమాత్రము నన్ను విడువకుండిన బసవరాజు గవర్రాజు గా రాకస్మికముగా 1888 వ సంవత్సరము జూలయి నెల 16 వ తేదిని లోకాంతర గతులయిరి. అటువంటి సుగుణనిధియైన మిత్రరత్నము యొక్క మరణముతో నాకావఱకున్న కార్యోత్సాహము సగము తగ్గిపోయినది. సదారోగ పీడితుఁడనగుచుండిన నేను చిరకాలము జీవింపననియు, నేను పూనిన మహాకార్యమును నాయనంతరమునం దాయన ధైర్యోత్సాహములతో నిర్వహించుననియు, నేను దృఢముగా నమ్మియుంటిని. అట్టి నాయాశ యకాలవినాశము నొందఁగా నేను విరక్తుఁడనయి, పురపరిపాలక సంఘములోను స్థానికనిధి సంఘములలోను నాసభ్యత్వములకు పరిత్యాగ పత్రికలను బంపి తదధ్యక్షులు నన్ను విడువ నొల్లకున్నను వలదని యాపనులనెల్ల నొక్క మాఱుగా మానుకొంటిని. గవర్రాజుగారు తనమరణమునకు నాలుగయిదు మాసములకు ముందొకనాఁడు నాయొద్దకువచ్చి నాజీవచరిత్రమును వ్రాయుటకయి సాధనముల నిమ్మని నన్నడిగెను; నేనాయనను నిరుత్సాహపఱిచి యిప్పుడా ప్రయత్నమును మాని నామరణానంతరమున నేమయిన వ్రాయఁదగియుండినచో వ్రాయవచ్చుననిచెప్పితిని. ఈసంభాషణము జరగిన కొన్ని మాసములలోనే