పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

379



సభ్యులయిన యస్మదాదులును ఏవిధముచేతనైనను పాఠశాలలనన్నిటి నొక్కటిగాఁజేర్చి యొక్క కార్యనిర్వాహక సంఘముయొక్క యధికారము క్రిందికిఁ దెచ్చి విద్యను బాగుచేయవలెనని నిశ్చయించుకొని, ప్రతిపక్ష పాఠశాలలవారు కోరిన నియమములనే యంగీకరించి, వారు చెప్పిన జీతములమీఁద వారి పాఠశాలలలోని యుపాధ్యాయులఁ దీసికొనుట కొప్పుకొని, వారిపాఠశాలాధికారియైన యేలూరి లక్ష్మీనరసింహముగారినే ప్రధానోపాధ్యాయ పదమునందు నిలిపి, పాఠశాలలు నన్నిటి నొక్కటిగాఁ గలిపి యొక్క సభవారి కార్యనిర్వాహకత్వమునకు లోఁబఱుపఁ గలిగితిమి.

ఇట్లు కలుపఁబడిన యీనూతనోన్నత పాఠశాలనిమిత్తము మందిరము కట్టుటకై పట్టణమధ్యమునందొక విశాల స్థలమును బేరమాడి క్రయనిర్ణయము చేసికొనుటకు సంసిద్ధులమయి యుంటిమి. ఇటువంటి మంచిస్థలము సులభ క్రయమునకు పోవుచున్నదని తెలిసికొని, దానిని తాను సంపాదింపవలెనని నిశ్చయించుకొని, మాసీమకు తహశ్శీలుదారుఁడుగానున్న బుద్ధిమంతుఁడు తత్క్షణమే యాక్షేత్ర స్వామిని తనయొద్దకు పిలిపించుకొని, ఆభూమిని తనవారి పేర వ్రాయించుకొనెను. ఆయన శక్తి సామర్థ్యాదుల నెఱిఁగిన మావారందఱును చేతఁజిక్కినస్థలము పోయినదని విచారించుచు నిరాశులయి, యటువంటి ప్రబుద్ధుని హస్తగతమైన భూమియొక్క పునరావాప్తి యసాధ్యమని భావించి, ఉత్తర కర్తవ్యమును నాకు విడిచిపెట్టి యూరకుండిరి. పోయిన భూమిని మరల రాఁబట్టుటకయి యుపాయము నాలోచించి నే నుపకరగ్రాహిగారి యొద్దకుపోయి మాటాడి యాయనచేత నొత్తుడుకలిగించి పులినోటఁ బడ్డ గోవును విడిపించితెచ్చిన ట్లా నేలను మరల పాఠశాలా కార్యనిర్వాహక సంఘమువారి యధీనమగునట్లు చేసితిని. ఇప్పుడు బోధనకళాశాలా భవనము కట్టఁబడి యున్న స్థలమిదియే.

దుర్బలశరీరుఁడనయ్యు వ్యాధిబాధితుఁడ నయ్యు నప్పుడిన్ని విధముల పాటుపడఁగలిగిన నేనిప్పుడు తొంటి జవసత్వములను గోలుపోయి కోరిక