పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

373



యనెడివాఁడను. నావర్తనమువలన ముందురాఁగల ఫలమును లేశమును విచారింపక స్వదేశీయుఁడైనను విదేశీయుఁడైనను హిందువైనను యూరపియనైనను లక్ష్యముచేయక నేను మంచిదనుకొన్న దానిని మొగము ముందఱ ననివేయునట్టియు నిర్భయముగా చేయునట్టియు తొందర స్వభావము నాకుఁగల లోపములలో నొకటి. ఈవేగిరపాటువలన మనవారిలో కొందఱు నాకప్పుడప్పుడు ద్వేషులగుటయు సంభవించుచువచ్చెను. అధ్యక్షులను కోరుకొను స్వాతంత్ర్య మియ్యఁబడుటకు పూర్వము పురపారిశుద్ధ్య విచారణ సంఘములకు మండల కరగ్రాహు లధ్యక్షులుగాను, ఉపకర గ్రాహులు మొదలైనవారధ్యక్ష ప్రతినిధులు గాను, ఉండుచువచ్చిరి. రాజమహేంద్రపుర పరిపాలక సంఘమున కుపకరగ్రాహి యధ్యక్ష ప్రతినిధిగానుండిన కాలములో జరగిన యొక సభలో విచారణీయములైన ముఖ్యాంశము లనేకములుండెను. కొన్ని యంశములు చర్చింపఁబడి నిర్ధారణములు చేయఁబడినతరువాత నప్పటికే కాలాతీతమయి నందున దొరగారు నిర్ధారణములపుస్తకములో వ్రాలుచేసి సభనువిడిచి వెడలిపోయిరి. అప్పుడు మిగిలియున్న కొన్ని యంశములను గూడ నీసభలోనే చర్చించి నిర్ధారణములుచేసి మఱి యిండ్లకు పోదమని నేను సభ్యులతోఁజెప్పితిని. కార్యస్థాన కార్య నిర్వాహకుఁడన్ని నిర్ధారణములను దొరగారు చేసియే పోయిరనిచెప్పెను. మాయభిప్రాయములను గైకొనక తమ మనసువచ్చినట్లు నిర్ధారణములు వ్రాసిపోవుటకు దొరగారికేమియధికారము కలదని నేను పలికితిని. సభ్యులందఱును నేనన్నది న్యాయమని తలఁచినను దొరగారు చేసిన దానిని మార్చుట కెవ్వరికిని చొరవలేకుండెను. సభవారి యనుమతితో నేను సాహసించి యగ్రాసనా సీనత్వమువహించి, దొరగారు కోపపడుదురని కార్యనిర్వాకుఁడు మొఱ్ఱపెట్టుచున్నను వినక మార్పవలసిన నిర్ధారణములనుమార్చి వానిక్రింద నావ్రాలుచేసితిని. సభ ముగియఁగానే కార్యనిర్వాహకుఁడు నిర్ధారణముల పుస్తకమును తీసికొనిపోయి నేనుచేసిన దుండగమును దొరగారికి విన్నవించి పుస్తకమును జూపెను. దొరగా రామార్పులనుజూచి మంచిదనిపలికి